అమెరికాలో పరిస్థితులు రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానున్నాయా..? అమెరికాలో రాజకీయ సంక్షోభానికి పునాది పడుతోందా..? అంటే అవుననే అంటోంది ఓ సర్వే. అమెరికాలో ప్రస్తుతం ప్రజల్లో.. ప్రభుత్వంపై అక్కడి రాజకీయాలపై విరక్తి పెరగడమే కాకుండా, జరుగుతోన్న చర్యలు వారిని చికాకుకు గురి చేస్తున్నాయని ఓ సర్వే బయటపెట్టింది. దాదాపు 80 శాతం మంది అమెరికన్లు అమెరికా సంక్షోభంలో ఉందని నమ్ముతున్నారని, సగానికి పైగా ప్రజలు రాబోయే సంవత్సరాల్లో రాజకీయ హింస మరింత తీవ్రమవుతుందని ఆందోళన చెందుతున్నారని తెలిపింది.
Also Read : జీఎస్టీ ఎఫెక్ట్.. ఏపీలో భారీగా వాహనాల అమ్మకాలు..!
ఇటీవలి సంఘటనల నేపధ్యంలో ఎంఏజీఏ కామెంటేటర్ చార్లీ కిర్క్ ఘటన తర్వాత పరిస్థితి అమెరికాలో వేగంగా మారుతోందని క్విన్నిపియాక్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పోల్ లో అభిప్రాయపడ్డారు. 79 శాతం మంది ఓటర్లు దేశం రాజకీయ సంక్షోభంలో ఉందని అంగీకరించగా , 18 శాతం మంది అంతగా లేదంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసారు. 93 శాతం డెమొక్రాట్లు ఈ విషయాన్ని అంగీకరించారు. ఇక 60 శాతం రిపబ్లికన్లు కూడా ఈ విషయంలో రాజకీయ సంక్షోభంలో దేశం ఉందని వెల్లడించారు.
Also Read : భారత్ మనతోనే ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన కామెంట్స్
అమెరికాలో రాజకీయ ప్రేరేపిత హింసను చాలా తీవ్రమైన సమస్యగా 71 శాతం మంది భావించారని, 22 శాతం మంది దీనిని కొంతవరకు తీవ్రమైన సమస్య”గా నమ్ముతున్నారని సర్వేలో వెల్లడి అయింది. జూన్ 26న క్విన్నిపియాక్ విశ్వవిద్యాలయం నిర్వహించిన మునుపటి పోల్ కంటే ఈ సర్వే మరింత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ పోల్ లో 54 శాతం మంది రాజకీయ ప్రేరేపిత హింస చాలా తీవ్రమైన సమస్య అని భావించగా.. 37 శాతం మంది దీనిని కొంత తీవ్రమైన సమస్యగా అభిప్రాయపడ్డారు. 54 శాతం మంది రాబోయే కొన్ని సంవత్సరాలలో అమెరికాలో రాజకీయ హింస మరింత తీవ్రమవుతుందని అంచనా వేసారు. 53 శాతం మంది, అమెరికాలో వాక్ స్వాతంత్ర్యం లేదని, మరింత ప్రమాదకరమైన సమస్యగా ఇదే మారే అవకాశం ఉందని అభిప్రాయపడినట్టు సర్వే వెల్లడించింది.