మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరులో మార్పు వచ్చిందా.. జగన్ తన ప్రధాన ప్రాధాన్యత ఏమిటో గుర్తించారా.. అంటే అవుననే మాట వినిపిస్తోంది. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీ. నాటి నుంచి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు టీడీపీ నేతలు. కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే అగ్రనేతలు స్పందిస్తారు కూడా. అందుకే టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి ఏకంగా రూ.5 లక్షల బీమా కూడా చెల్లిస్తోంది పార్టీ. ఇక ఎవరైనా పార్టీ నేతలు ప్రమాదవశాత్తు మృతి చెందితే.. వారి పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత విద్య కూడా అందిస్తున్నారు.
Also Read : మరో తేదీ ప్రకటించిన జగన్..!
కార్యకర్తలే ఫైనల్ అనేది తెలుగుదేశం పార్టీ నినాదం. అందుకే పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతి రోజు కార్యకర్తల కోసం ప్రత్యేక విభాగాలు పని చేస్తాయి. అలాగే అధినేతను కలిసేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. కార్యకర్తల సహాయం కోసం ప్రత్యేక సెల్ నెంబర్ కూడా అందుబాటులో ఉంచారు. దీంతో ప్రతి రోజు కార్యకర్తలు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఎన్టీఆర్ భవన్ కార్యకర్తల కోసం పని చేస్తుందనే నమ్మకం కార్యకర్తల్లో ఉంది. దీంతో కార్యకర్తలకు పార్టీ అండగా ఉంది అనే భరోసా ఇక్కడే లభిస్తుంది.
ఇదే సమయంలో వైసీపీ అధినాయకత్వం తీరుపై తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధినేతను కలవాలంటే అది అసాధ్యమనే చెప్పాలి. కిందిస్థాయి నేత అనుమతి ఉంటే తప్ప అధినేతను కలిసే అవకాశం లేదు. 2014-19 మధ్య కాలంలో కూడా అధినేత దర్శన భాగ్యం కలగలేదు. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించారు జగన్. అయితే అనూహ్యంగా పాదయాత్ర చేపట్టడంతో ప్రజల మధ్య ఉన్నారనే ఫీలింగ్ పార్టీ కార్యకర్తలకు కలిగింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. కార్యకర్తకు కాదు కదా.. కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా జగన్ దర్శన భాగ్యం లభించలేదు. ఇక జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు అయితే.. పరదాల మధ్య ప్రయాణం సాగింది.
Also Read : 4 రోజుల పాటు ఆ సినిమాకు బ్రేక్..!
ఓడిన తర్వాత కూడా బెంగళూరులో ఉంటున్న జగన్.. వారంలో 3 రోజుల పాటు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారు. అది కూడా కేవలం ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపి వెళ్లిపోతున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు కార్యకర్తలే నా దేవుళ్లు.. వారి మాటే ఫైనల్ అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పరదాల మధ్య తిరిగిన జగన్.. ఇప్పుడు మాత్రం.. ప్రతి పర్యటనలో సెక్యూరిటీని పక్కన పెట్టేసి అందరిని కలుస్తున్నారు. తాజాగా కార్యకర్తల కోసమే అంటూ డిజిటల్ బుక్ యాప్ ప్రారంభించారు. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు వలంటీర్లు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించిన జగన్.. ఇప్పుడు మాత్రం పదే పదే కార్యకర్తల జపం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో వస్తే.. కార్యకర్తలే పాలకులంటూ కొత్త పాట పాడుతున్నారు జగన్. దీంతో వైఎస్ జగన్‌లో మార్పు వచ్చిందని పార్టీ నేతలు భావిస్తున్నారు.