అమెరికా దెబ్బకు ఇప్పుడు భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్ వైపు దృష్టి సారించింది. యూరప్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. దాదాపు 20 సంవత్సరాల చర్చల తర్వాత యూరప్ దేశాల వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ – యూరోపియన్ యూనియన్ మధ్య ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముగిసినట్లు అధికారిక ప్రకటన రానుంది.
Also Read : పార్టీలో అందరి తాట తీస్తానంటున్న విజయ్..!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ శిఖరాగ్ర సమావేశంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని, ఇతర ఒప్పందాలను కూడా ఖరారు అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతోన్న చర్చలు విజయవంతంగా ముగిశాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సోమవారం ప్రకటించారు.
Also Read : హెచ్ 1 బీ వీసాలకు రెండేళ్ళు ఆగాల్సిందేనా..?
ప్రస్తుతం, యూరోపియన్ యూనియన్ లో.. భారత వస్తువులపై సగటు సుంకం దాదాపు 3.8 శాతంగా ఉంది. శ్రమతో కూడిన ఉత్పత్తులపై సుంకాలు 10 శాతం వరకు ఉన్నాయి. ఇక వారి వస్తువులపై మన దేశంలో సగటు సుంకం 9.3 శాతంగా ఉంది. ఆటోమొబైల్స్, ప్లాస్టిక్లు, రసాయనాలు మరియు ఔషధాలపై అధిక సుంకాలు ఉన్నాయి. ఈ ఒప్పందం తర్వాత భారత ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వస్త్రాలు, రసాయనాలు, రత్నాలు, ఆభరణాలు, విద్యుత్ యంత్రాలు, తోలు మరియు పాదరక్షలు వంటి శ్రమతో కూడిన రంగాల నుండి సుంకం రద్దు చేసే అవకాశాలు కనపడుతున్నాయి.

