సాధారణంగా గల్ఫ్ దేశాలు అనగానే చౌకగా లభించే ఇంధనం అందరికీ గుర్తుకువస్తుంది. కానీ, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో సీన్ రివర్స్ అయింది. మన దేశంలోని పలు ప్రధాన నగరాలతో పోలిస్తే యూఏఈలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. అక్టోబర్ నెలలో యూఏఈ ఇంధన ధరలను దాదాపు 16 శాతం మేర పెంచడంతో అక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు భారత నగరాల కంటే ఎగబాకాయి. ముఖ్యంగా డీజిల్ విషయానికి వస్తే, దుబాయ్లో లీటర్ డీజిల్ ధర భారత కరెన్సీలో సుమారు రూ. 123.31 కి చేరింది.
Also Read : ప్రొటోకాల్స్ పక్కనపెట్టి సీఎం ఇంటికి జనసేనాని..!
ఇది మన దేశంలోని ఏ ప్రధాన నగరం కంటే కూడా చాలా ఎక్కువ. దేశంలో చండీగఢ్, ఢిల్లీ, నోయిడా, లక్నో వంటి నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101 నుండి రూ. 102 ల మధ్య కొనసాగుతుండగా, యూఏఈ లోని స్పెషల్ 95 గ్రేడ్ పెట్రోల్ ధర రూ. 109.95 గా ఉంది. అంటే దుబాయ్ కంటే మన ఢిల్లీ, నోయిడా వాసులే తక్కువ ధరకే పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. అయితే, హైదరాబాద్ (రూ. 116.15), ముంబై (రూ. 111.21), కోల్కతా (రూ. 113.51) వంటి నగరాల్లో మాత్రం పెట్రోల్ ధరలు దుబాయ్ కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి.
Also Read : దావూద్ పాక్ లోనే.. ఐరాసాలో భారత్ సంచలన కామెంట్స్..!
అంతర్జాతీయ ఇంధన మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల అక్టోబర్ నెలలో యూఏఈ లోని సూపర్ 98, స్పెషల్ 95, ఈ-ప్లస్ 91 వంటి అన్ని రకాల ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ప్రతి నెలా ఇంధన ధరలను సమీక్షించే యూఏఈ ప్రభుత్వం, రానున్న నవంబర్ నెలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


