ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇవి రాజకీయ విమర్శలు కాదు. ఇవన్నీ ప్రభుత్వ సంస్థల తీరుపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు. అలాగే పక్క రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ సంస్థల తీరుపై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ అయితే… మరోటి కర్ణాటక రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ, ఒడిశా రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ. ఏపీఎస్ ఆర్టీసీ తీరుపై చేయని విమర్శలు అంటూ లేవు… ఇందుకు ప్రధాన కారణం… ఆర్టీసీ బస్సుల పనితీరు… విధానం కూడా. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేసి చాలా రోజులైంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే కొత్త బస్సులు వస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క కొత్త బస్సు కాదు కదా.. విడిభాగాలు కూడా అందుబాటులో లేని దుస్థితి. దీంతో చాలా సర్వీసులు ఎక్కడ పడితే అక్కడే ఆగిపోయాయి కూడా.
రహదారులు కూడా పూర్తిగా గుంతలమయం కావడంతో.. ఆ మార్గంలో నడుస్తున్న బస్సులు అయితే.. పార్టు పార్టులుగా విడిపోయాయి. సీట్లు ఇరిగిపోయి.. కిటికీలు పగిలిపోయి.. చివరికి బస్సుల వెనుక చక్రాలు కూడా విరిగిపోతున్నాయి. వీటికి తోడు అంతంత మాత్రం నిర్వహణతో.. చివరికి లైట్లు కూడా సరిగ్గా వెలగని దయనీయ పరిస్థితిలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు నడిచాయి. ఉన్న ఒకటి రెండు బస్సులు కూడా.. ప్రమాదాలకు గురవ్వడంతో.. ఏపీఎస్ ఆర్టీసీ అధికారులను సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు.
Also Read : దేశాన్ని వణికిస్తున్న భూకంపాలు.. షేక్ అవుతున్న ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు
ఇక ప్రయాణీకులకు ప్రైవేటు బస్సులు రకరకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. స్లీపర్ బస్సులు, వోల్వో మల్టీ యాక్సల్, స్లీపర్ కమ్ సీట్ బస్సులు.. ఇలా ఎన్నో ఉన్నాయి. దీంతో ప్రయాణీకులు ప్రైవేటు బస్సుల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఇదే సమయంలో కేఎస్ ఆర్టీసీ తీరు కూడా గమనించాలి. ప్రయాణీకుల కోసం నిత్యం అప్ డేట్ వర్షన్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది కేఎస్ ఆర్టీసీ. సరికొత్త సర్వీసులు, సౌకర్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తోంది. దూర ప్రయాణాల కోసం స్లీపర్ బస్సులు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయి. ముందుగా ప్రైవేటు సర్వీసుల్లో స్లీపర్ బస్సులు వచ్చాయి. వాటిని వెంటనే కేఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ముందు నాన్ ఏసీ సర్వీసులు… తర్వాత ఏసీ సర్వీసులు.. అంబారీ పేరుతో వోల్వో స్లీపర్ బస్సులు కూడా ప్రస్తుతం నడుపుతోంది.

ఇక అంబారీ ఉత్సవ్ పేరుతో… సరికొత్త వోల్వో 9600 మోడల్ బస్సులను కూడా కేఎస్ ఆర్టీసీ నడిపిస్తోంది. ఒక్కో బస్సు విలువ అక్షరాల రెండున్నర కోట్ల రూపాయలు. మొత్తం 40 స్లీపర్ బస్సులు తెప్పించిన కేఎస్ ఆర్టీసీ అధికారులు.. వాటితో ఏకంగా బెంగళూరు విధాన్ సౌధ ముందు పరేడ్ నిర్వహించారు. అలాగే టెస్ట్ డ్రైవ్ పేరుతో బెంగళూరు నగరంలో వాటితో ర్యాలీ నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో.. నమ్మ ఆర్టీసీ అని కన్నడ వాసులు కితాబిస్తున్నారు.క ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
Also Read : జనంలోకి టీడీపీ.. టార్గెట్ ఫిక్స్..!
తాజాగా ఇవే వోల్వో 9600 మోడల్ బస్సులను ఒడిశా రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఓఎస్ ఆర్టీసీ కూడా కొనుగోలు చేసింది. వాటిని భువనేశ్వర్ – తిరుపతి, భువనేశ్వర్ – హైదరాబాద్, భువనేశ్వర్ – కోల్‌కతా మధ్య నడిపిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జగన్నాథ్ ఎక్స్‌ప్రెస్ పేరుతో బ్రాండ్ న్యూ స్లీపర్ బస్సులను ప్రారంభించారు. ఈ వీడియోను ఓఎస్ఆర్టీసీ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే మరిన్ని బస్సులు కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
అయితే ఈ వీడియోలను ఏపీ వాసులు ఏపీఎస్ ఆర్టీసీకి ట్యాగ్ చేస్తూ.. విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి బస్సులు మీరెప్పుడు తెప్పిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి 2003లోనే తొలి వోల్వో బస్సును నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇక 2014లో అధికారంకి వచ్చిన తర్వాత వోల్వో కొత్త బస్సులు కొనుగోలు చేసి వాటిని అమరావతి పేరుతో ఆర్టీసీ నడిపిస్తోంది. ఇవి కూడా ఇప్పుడు చాలా వరకు పాతవే. కొత్తగా ఒక్క బస్సు కూడా రాలేదు. స్లీపర్ బస్సులకు డిమాండ్ పెరుగుతుండటంతో.. నైట్ రైడర్, వెన్నెల పేరుతో స్లీపర్ బస్సులను ఇప్పుడిప్పుడే ఏపీఎస్ ఆర్టీసీ నడిపిస్తోంది. ఓ వైపు బ్రాండ్ న్యూ వోల్వో స్లీపర్ బస్సులను పక్క రాష్ట్రాలు నడిపిస్తుంటే.. ఏపీ అధికారులు మాత్రం.. ఇప్పటి వరకు కనీసం ఒక్క బస్సు కోసం కూడా ఆర్డర్ ఇవ్వలేదు.
Also Read : సజ్జల అరెస్ట్ ఖాయం.. లోకేష్ ట్వీట్ ఇచ్చిన సిగ్నల్..?
ఓ వైపు ప్రైవేట్ ట్రావెల్స్‌తో పాటు పక్క రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ప్రయాణీకులను ఆకర్షించేందుకు కొత్త కొత్త సర్వీసులను ప్రవేశపెడుతూ.. సౌకర్యాలు కల్పిస్తుంటే… ఏపీఎస్ ఆర్టీసీలో మాత్రం.. ఇప్పటికీ కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులనే ఇప్పటికీ నడిపిస్తున్నారు. కొన్ని బస్సుల్లో అయితే సీట్లు కూడా సరిగ్గా లేవు అని విమర్శలు కూడా చేస్తున్నారు. కొత్త బస్సులు తర్వాత… ఉన్న బస్సులైనా సరిగ్గా ఉన్నాయా అనేది నెటిజన్ల కామెంట్లు. మరి వీటికి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఎలా జవాబిస్తారో చూడాలి.

