గ్రేటర్ విశాఖ మేయర్ గొలగాని వెంకట హరికుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం గెలిచింది. మేయర్ హరికుమారికి వ్యతిరేకంగా 74 మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గటంతో హరికుమారి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విశాఖ మేయర్ స్థానం కూటమి ఖాతాలోకి చేరుకుంది. అయితే ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి మేయర్‌గా హరికుమారికి మరో ఏడాది మాత్రమే గడువుంది. కానీ ఈ లోపే వైసీపీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరిపోవడంతో సీన్ మారిపోయింది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు 74 మంది మద్దతు అవసరం. ఓటింగ్ సమయానికి కూటమికి సరిగ్గా 74 మంది సభ్యులు మద్దతు తెలియజేయడంతో.. వైసీపీ కార్పొరేటర్లు ఈ ఎన్నికను బాయ్‌కాట్ చేశారు.
Also Read : కోడెలకు అండగా నిలిచాననే జగన్ దూరం పెట్టారు: రఘురామ
అయితే ఈ ఎన్నికపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. “రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ 58 స్థానాలను గెలుచుకోగా.. టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందని.. మరి మీకు మేయర్ పదవి ఏరకంగా వస్తుంది అంటూ ప్రశ్నించారు జగన్. బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదన కులానికి చెందిన మహిళకు మేయర్‌గా వైసీపీ అవకాశం ఇచ్చిందని.. అధికార దుర్వినియోగం చేస్తూ.. కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే వైసీపీ కార్పొరేటర్లు ఉన్న హోటల్‌పై దాడులు చేయించారని.. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయన్నారు జగన్.
Also Read: రోజాకు అండగా కూటమి మంత్రి
దీన్ని ప్రజాస్వామ్యం అంటారా.. అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది? అంటూ ప్రశ్నించారు జగన్. అలాగే మరో ఏడాదిలో కౌన్సిల్ ఎన్నికలు వస్తాయి.. అప్పుడు ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం మీకు లేదు.. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు చంద్రబాబు గారు అంటూ చివర్లో శాపనార్థాలు కూడా జగన్ చెప్పారు. జగన్ వ్యాఖ్యలకు కూటమి నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు మర్చిపోతే ఎలా జగన్ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం మీకు అధికారం ఉంది కాబట్టి కాకినాడ మేయర్‌గా ఉన్న టీడీపీ మహిళా నేతను మీరు దించేసిన రోజును మర్చిపోయారా జగన్.. అంటూ ప్రశ్నించారు. ఆ రోజు కాకినాడ మేయర్ మహిళ కాదా.. ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మీకు అంటూ విమర్శల వర్షం కురిపించారు. మీరు చేస్తే సంసారం.. ఎదుటి వాళ్లు చేస్తే వ్యభిచారం ఎలా అవుతుంది జగన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

