ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్న వైసిపి ఇప్పుడు క్రమంగా బలహీనపడుతోంది. పార్టీని ముందు నుంచి మోసిన నెల్లూరు జిల్లా ప్రజలు.. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఊహించని దెబ్బ కొట్టారు. నెల్లూరు పార్లమెంటుతో పాటుగా.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కూటమి కైవసం చేసుకుని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి పార్టీ క్రమంగా బలహీనపడుతూ వస్తోంది. జిల్లాలో నాయకులు మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం కూడా ఆ పార్టీకి ఇక్కడ సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఇక వైసీపీలో కీలక నేతగా చెప్పుకునే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీనితో జిల్లాలో పార్టీకి పెద్దదిక్కు లేకుండా పోయింది.
Also Read : ఏపీ జనసేన చీఫ్ గా ఎంపీకి ఛాన్స్..? పవన్ కీలక నిర్ణయం..?
అటు వైసీపీ అధిష్టానం కూడా కొంతమందికి ప్రాధాన్యత ఇస్తుంది అనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ పార్టీ మేయర్ పీఠాన్ని కూడా కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి. నెల్లూరు మేయర్ స్రవంతి అక్రమాలకు పాల్పడుతున్నారని.. నిన్న 40 మంది కార్పొరేటర్లు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఇక జాయింట్ కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీస్ కూడా 40 మంది కార్పొరేటర్లు ఇచ్చారు. దీంతో మేయర్ తన పదవిని కోల్పోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక తాజాగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ మేయర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Mountaineer Thammineni Bharath : పర్వతారోహణ గురించి తమ్మినేని భరత్ ప్రత్యేక ఇంటర్వ్యూ
మేయర్ స్రవంతి భర్త ఇక్కడ షాడో మేయర్ గా వ్యవహరిస్తున్నారని.. అక్రమాలకు అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. కమిషనర్ సంతకాలను మేయర్ భర్త జయవర్ధన్ ఫోర్జరీ చేసి ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్ స్రవంతి పాలనలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని.. గడిచిన నాలుగేళ్లలో ఏడుసార్లు మాత్రమే కౌన్సిల్ మీటింగ్ పెట్టారని మండిపడ్డారు. అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కొత్త మేయర్ రావాల్సిన అవసరం ఉందన్నారు రూప్ కుమార్. మేయర్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మేయర్ పదవిని కాపాడుకోవడానికి స్రవంతి ప్రయత్నాలు చేస్తున్నా సరే పెద్దగా ఫలించడం లేదు అనే వార్తలు వస్తున్నాయి.

