భారతీయ రైల్వే వ్యవస్థ దూసుకెళ్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని మార్గాలను అప్ గ్రేడ్ చేస్తోంది రైల్వే శాఖ. 130 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లేలా ట్రాక్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఇక ప్రధాన నగరాల మధ్య వందే భారత్ పేరుతో సెమీ బుల్లెట్ రైలు పరుగులు పెడుతోంది. దీనికి విపరీతమైన డిమాండ్ రావడంతో… త్వరలోనే వందే స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును పట్టాలెక్కించేందుకు రైళ్ల శాఖ సిద్ధమవుతోంది. ఇదే సమయంలో వంద నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని పట్టణాల మధ్య ప్రయాణీకుల సౌకర్యం కోసం వందే మెట్రో రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది రైళ్ల శాఖ. సరిగ్గా నెల రోజుల క్రితం అహ్మదాబాద్ – భుజ్ పట్టణాల మధ్య వందే మెట్రో రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ… దానికి నమో భారత్ ర్యాపిడ్ రైల్ అని పేరు పెట్టారు.
తక్కువ ఛార్జీతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఏసీ రైలు ప్రయాణం కల్పించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ రైలును దేశవ్యాప్తంగా విస్తరించాలని రైళ్ల శాఖ భావిస్తోంది. నమో భారత్ ర్యాపిడ్ రైల్‌ను ఇప్పుడు ఏపీకి కేటాయించేందుకు ఇద్దరు కేంద్ర మంత్రులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రెండు కీలక మార్గాల్లో వందే మెట్రో పరుగులు పెడితే…. ఈ ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఇప్పటికే రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి శ్రీకాకుళం లేదా పలాస స్టేషన్ల మధ్య రైలు నడపాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇప్పటికే కేంద్ర మంత్రి అశ్వీని వైష్ణవ్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఈ మార్గంలో వేల మంది రాకపోకలు సాగిస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అలాగే మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా నమో భారత్ ర్యాపిడ్ రైల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also : బాబు గారు… మమ్మల్ని ఆదుకోండి ప్లీజ్…!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత రద్దీతో పాటు అత్యధిక ఆదాయం వచ్చే మార్గాల్లో గుంటూరు – నంద్యాల ఒకటి. ఈ రూట్‌లో నల్లమల అటవీ మార్గంలో ఓ పది కిలోమీటర్లు మినహా మిగిలిన మార్గం మొత్తం డబుల్ ట్రాక్ పూర్తి చేశారు. రాయలసీమ నుంచి రాజధానికి కనెక్టవిటీ ఉన్న మార్గం కావడంతో… ఈ ప్రాంతానికి సౌకర్యంగా కూడా ఉంటుందని కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బైరెడ్డి శబరిలు కేంద్ర రైల్వే శాఖను కోరినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఈ నెల 4న విజయవాడలో జరగనున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం, డీఆర్ఎం స్థాయి సమావేశంలో కూడా మరోసారి ప్రస్తావించేందుకు సిద్ధమయ్యారు. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే… అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, కోస్తా, పల్నాడు ప్రాంత వాసులకు మెరుగైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.




