ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టిన టీటీడీ.. ఇప్పటికే పాతబడిన, శిథిలమైన దేవాలయాలను, విగ్రహాలను శాస్త్రోక్తంగా పునరుద్ధరించి, వాటిని తిరిగి పవిత్రంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రకృతి కారణాల వల్ల లేదా కాలక్రమేణా పాడైపోయిన ఆలయ నిర్మాణాలు, మూర్తులను పునఃస్థాపించడం లేదా కొత్తగా నిర్మించడంతో పాటు ఆయా ఆలయాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను కూడా టీటీడీ అందిస్తోంది.
Also Read : గ్రీన్ కార్డులపై ట్రంప్ సంచలన నిర్ణయం..!
తాజాగా హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్, గొడుగులు, శేష వస్త్రం, రాతి, పంచలోహ విగ్రహాలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా టీటీడీ విడుదల చేసింది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందూ దేవాలయాలకు రాయితీపై అందిస్తుంది. ఎస్‌సీ, ఎస్‌టీలకు 90 శాతం రాయితీ ఇస్తున్నారు. అలాగే ఇతర ఆలయాలకు 50 శాతం రాయితీపై అందివ్వనున్నారు.
మైక్ సెట్ కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ.25 వేలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎస్‌సీ, ఎస్‌టీ లకు 90 శాతం రాయితీ మినహాయించి మిగిలిన రూ.2,500 డీడీ తీసి పంపించాల్సి ఉంటుంది. ఇతరులకు 50 శాతం రాయితీ మినహాయించి రూ.12,500 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గొడుగుల కేటాయింపులో హిందూ దేవాలయాలకు కేటగిరీలతో సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తుదారులకు రూ.14,500 విలువ చేసే గొడుగులను 50 శాతం రాయితీతో రూ.7,250లకే టీటీడీ అందిస్తుంది.
Also Read : పది నిమిషాలు నడిస్తే డైట్ అవసరం లేదా..?
ఇక హిందూ దేవాలయాలకు ఉచితంగా శేష వస్త్రాన్ని టీటీడీ ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం ఆలయ అభ్యర్థన లేఖను కార్యనిర్వహణాధికారి, తిరుపతి పేరుతో దరఖాస్తు చేయాలి. సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్, అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ నుండి సిఫార్సు లేఖ, దరఖాస్తు దారు ఆధార్ కార్డు, ఆలయ ఫోటోను జత చేయాలి.
ఇక రాతి, పంచలోహ విగ్రహాలను టీటీడీ అందించనుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతీ అమ్మవారి రాతి విగ్రహాలను 5 అడుగులు, అంతకంటే తక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలను ఉచితంగా అందిస్తారు. మిగిలిన దేవతా విగ్రహాలకు 75 శాతం సబ్సిడీపై కేవలం 25 శాతం ధరను చెల్లిస్తే వివిధ వర్గాల వారికి అందిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా రాతి విగ్రహాలను అందిస్తారు. పంచ లోహ విగ్రహాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 90 శాతం సబ్సిడీతో, ఇతర వర్గాల వారికి 75 శాతం సబ్సిడీతో అందిస్తారు. దేవతా మూర్తుల రాతి, పంచలోహల విగ్రహాల పేర్లు, కొలతలతో కార్యనిర్వహణాధికారి, టిటిడి వారికి ఆలయ అభ్యర్థన లేఖ పంపించాలి. వీటి కోసం ఆలయ బ్లూ ఫ్రింట్‌ను ఏ4 సైజ్‌లో, అవసరమైన విగ్రహాల డ్రాయింగ్ , ఒరిజినల్ ఆలయ ఫోటో, దరఖాస్తుదారు ఆధార్ కార్డు కూడా జత చేయాలి.
Also Read : చరిత్ర సృష్టించిన సీఎం చంద్రబాబు
వీటితో పాటు విద్యార్థుల్లో భక్తి భావన పెంపొందించేందుకు కూడా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఈవో లేదా డీఈవో ఆమోదం పొందిన విద్యా సంస్థలకు సరస్వతీ దేవీ రాతి విగ్రహాన్ని 50 శాతం సబ్సిడీతో టీటీడీ అందిస్తోంది. అలాగే మఠాలు, ట్రస్టులకు, ఆశ్రమాలకు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను 50 శాతం రాయితీతో అందిస్తారు. టీటీడీ నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా డీడీతో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి, టీటీడీ పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు పంపాలి.

