జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. జనవర 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. అందుకు సంబంధించిన ఆన్‌లైన్ కోటా టికెట్లను ఇప్పటికే టీటీడీ విడుదల చేసింది కూడా. అయితే తాజాగా మరో విషయం వెల్లడించింది. ఆన్‌లైన్‌లో టికెట్ దొరకని భక్తుల కోసం ఉచిత టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
Also Read : పదవులిచ్చారు.. ఆ తర్వాత ఏమయ్యారు వాళ్లు..?
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, 1తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈవో శ్రీ శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1.20 లక్షల టోకెన్లు విడుదల చేస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.
తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మునిసిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎం.ఆర్. పల్లి స్కూల్‌లతో పాటు తిరుమలలో బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్‌లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.
Also Read : నేను తగ్గను.. బెనిఫిట్ షోస్ ఉండవు: రేవంత్ క్లారిటీ
కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను టిటిడి ఈవో, అదనపు ఈవో తనిఖీ చేశారు.

