తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు ప్రకటించారు. అయితే ప్రమాదానికి కేవలం నిర్లక్ష్యం మాత్రమే కారణమన్నారు చంద్రబాబు. అలాగే సరైన ప్లానింగ్ లేకపోవడంతో ప్రమాదంలో ఆరుగురు చనిపోయారని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకదశలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మొత్తాన్ని తప్పుబట్టారు. అలాగే ఉన్నతస్థాయి ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు.
Also Read: పిలుపు దూరంలో మంత్రి.. ఏపీ కేబినేట్ లో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్..!
ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే శ్రీవారి గరుడ వాహన సేవకు 4 లక్షల మంది భక్తులు పాల్గొంటారని… అప్పుడు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. కేవలం 2,500 మందిని అధికారులు నియంత్రించలేకపోయారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ప్రమాదానికి కేవలం అవగాహన రాహిత్యం అన్నారు సీఎం చంద్రబాబు. బోర్డు ఛైర్మన్ కు, ఈవోకు, ఏఈవోకు మధ్య చాలా గ్యాప్ ఉందన్నారు. ప్రమాదంపై అత్యవసర సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. అలాగే ముగ్గురు అధికారులపై బదిలి వేటు వేశారు. అయితే ప్రమాదంపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి.. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు చంద్రబాబు. ఈ ఘటనకు ప్రధానంగా టీటీడీ ఉన్నతాధికారులదే బాధ్యత అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: ఎమ్మెల్యేలు జారిపోతారా..? కాచుకు కూర్చున్న బిజెపి…!
టికెట్లు ఇచ్చే ప్రదేశాలు ముందుగానే ప్రకటించిన టిటిడి… భక్తులను కట్టడి చేసేందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకయ్య చౌదరి వేర్వేరుగా సమీక్షలు చేశారు.. ప్రెస్ మీట్ పెట్టారు. అంతే తప్ప వైకుంఠ ఏకాదశిపై టిటిడి బోర్డు కనీసం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, పనులు పురమాయించడం తప్ప… వాటి పనితీరు పై ఉన్నత స్థాయిలో కనీస పర్యవేక్షణ లేదు అనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ప్రమాదానికి బాధ్యులుగా ఈవో శ్యామలరావును తొలగిస్తారా లేక ఏఈఓ వెంకయ్య చౌదరి పై వేటు పడుతుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వైకుంఠ ద్వార దర్శనం ముగిసే వరకు ఎలాంటి చర్యలు తీసుకోరని… ఆ తర్వాత తప్పకుండా ఇద్దరిలో ఒకరిపై వేటు ఖాయమంటున్నారు ప్రభుత్వ పెద్దలు.

