తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక అడుగులు వేస్తున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ఉన్న నాయకులే ప్రస్తుతం టిడిపిలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అప్పట్లో యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇలా పలువురు కీలక నాయకులు తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు.
Also Read : నేతల రాజీనామాల వెనుక కారణమదే..!
ప్రస్తుతం వీరిలో కొంతమంది మంత్రి పదవులతో పాటుగా పార్టీ పదవులను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే మరో 30 ఏళ్లు పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న పార్టీ అధిష్టానం.. యువ నాయకులను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులతో పాటుగా విద్యావంతులను కూడా పార్టీలోకి తీసుకువచ్చే దిశగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది. గతంలో ఉన్న సాంప్రదాయాలకు ముగింపు పలుకుతూ కొత్త సాంప్రదాయాలకు తెర తీసే దిశగా అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది.
Also Read : లోకేష్ కు ప్రమోషన్, మహానాడులో సంచలన నిర్ణయం
పార్టీ అనుబంధ సంఘాలను కూడా బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకునే సంకేతాలు కనపడుతున్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉన్న కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఐదేళ్ల కు మించి పదవుల్లో ఉన్నవారిని పక్కకు తప్పించాలని.. అలాగే సీనియర్ నేతల నియోజకవర్గాల్లో కూడా యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నారా లోకేష్ రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు సమాచారం. మహానాడులో కీలక ప్రకటనలు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. రెండు రోజుల నుంచి నారా లోకేష్ కు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం సైతం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే సీనియర్ నాయకత్వానికి ఇక పార్టీలో శేష జీవితమే అనే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.

