తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో ఉత్సాహం లేదా…? గెలిచిన ఆనందంలో ఉన్న కార్యకర్తలకు కనీసం అండగా నిలబడటంలో ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఇటీవల ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం అనే ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనికి పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇచ్చారు. హోర్డింగ్ లు కూడా ఏర్పాటు చేసారు. కాని అసలు కీలకమైన ప్రజా ప్రతినిధులు మాత్రం ఈ విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు.
ఉదాహరణకు విజయవాడ, గుంటూరు, బందరు పార్లమెంట్ నియోజకవర్గాలు తీసుకుంటే ఒక్కకంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా జోష్ కనపడలేదు. ఎమ్మెల్యేలు కనీసం వార్డుల్లో కూడా తిరగలేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, మీకు అందుతున్నాయా లేదా పెన్షన్ వస్తుందా లేదా రేషన్ అందుతుందా లేదా ఇలాంటివి ఏమీ ఎమ్మెల్యేలు ప్రజలను సరిగా అడగలేదు. కార్యక్రమాలు చేసినా అవి నామ మాత్రంగానే చేసారు అనే ఆరోపణ ఉంది. రాజధానికి సమీపంలో ఉండే గ్రామాల్లో కూడా జోష్ కనపడలేదు.
Read Also: వారిని తాట తీయండి.. బాబు సంచలన ఆదేశాలు
పెన్షన్ విషయంలో ప్రభుత్వంపై సానుకూలత ఉంది. విజయవాడ వరదలతో సానుకూలత పెరిగింది అయినా కూడా ఆ సానుకూలతను వాడుకోవడంలో టీడీపీ ఎమ్మెల్యేలు విఫలం అవుతున్నారు. కూటమిలో మిగిలిన రెండు పార్టీల పరిస్థితి కూడా అలాగే ఉంది. గేటుకి స్టిక్కర్ అతికించి వెళ్ళడం మినహా మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకుని వెళ్ళడం లేదు. గతంలో కూడా ప్రభుత్వ సానుకూలతను పెంచడంలో ఎమ్మెల్యేలు దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. మరి భవిష్యత్తులో అయినా మారుతుందా లేదా చూడాలి.