ఏపీ రాజకీయాల్లో గత పది రోజుల నుంచి మావిగన్ వ్యవహారం సంచలనంగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ అంశం తెరపైకి తెచ్చిన నాటి నుంచి అధికార కూటమి.. జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. అయితే.. అధికార కూటమి, ముఖ్యంగా టీడీపీ అనుసరిస్తున్న తీరుపై రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో టీడీపీ కేడర్ కేవలం ప్రత్యర్థి నాయకులపై విమర్శలు, సోషల్ మీడియాలో వెటకారాలకే పరిమితమవుతోందని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : టార్గెట్ ఒలింపిక్స్.. మరి వసతుల మాటేమిటీ..?
గత ప్రభుత్వ వైఫల్యాలను లేదా ‘మావిగన్’ తీరును ఎండగట్టడం సహజంగా చేయవచ్చు. కానీ, నిరంతరం అవే విమర్శలతో కాలం గడపడం వల్ల పార్టీకి కొత్తగా వచ్చే మైలేజీ ఏమీ ఉండదు. ప్రజలు ఎప్పుడూ భవిష్యత్తు వైపు చూస్తారు. ప్రస్తుతం ఏపీలో కొన్ని కీలకమైన మౌలిక సదుపాయాల పనులు వేగవంతం అయ్యాయి. కానీ వీటి గురించి ప్రజల్లో చర్చ జరగడం లేదు. కృష్ణా జిల్లా ముఖచిత్రాన్ని మార్చేసే బందరు పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తయితే వేలమందికి ఉపాధి రావడమే కాకుండా, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోతాయి.
Also Read : నేతల్లో విభజన భయం.. కార్యకర్తలకు దూరం..!
అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభంతో పాటు విజయవాడ, గుంటూరు నగరాల్లో రోడ్ల విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని సామాన్యులకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉంది. కేవలం విమర్శలకే పరిమితమైతే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజలకు చేరే అవకాశం ఉండదు. కృష్ణా, గుంటూరులో రాజధానితో సమానంగా అభివృద్ధి జరుగుతోంది అనే విషయాన్ని ప్రజలకు వివరించే విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతోందనే విమర్శలు వస్తున్నాయి.

