తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా హాట్‌గా ఉన్నాయి. నిజానికి ఓ వైపు చలి పులి పంజా విసురుతుంటే.. రాజకీయ నేతల విమర్శలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఒకే తరహా చర్చ జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి నేతల మధ్య నీటి ప్రాజెక్టుల నిర్వహణ అంశంపై చర్చ జరుగుతుంటే.. ఏపీలో కూటమి పార్టీలు, వైసీపీ నేతల మధ్య ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించడంపై ఆరోపణ ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో రెండు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి అంశంపై కూడా చర్చ నడుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, బెదిరింపులు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి.
Also Read : వైసీపీ క్యాడర్ లో కేసీఆర్ జోష్.. పండగే..!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు కేసీఆర్. టీఆర్ఎస్‌తో మొదలైన ప్రయాణానికి.. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత బ్రేకులు పడ్డాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ బయటకు రాలేదు. రెండేళ్ల కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా గైర్హాజరయ్యారు. ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే సభకు వచ్చారు కేసీఆర్. అది కూడా బడ్జెట్ ప్రసంగం రోజు మాత్రమే. ఆ తర్వాత మళ్లీ కనిపించ లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నిసార్లు సభకు రావాలని సవాల్ విసిరినా సరే.. దానిపై కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు కనీసం స్పందించలేదు. తాజాగా 8 నెలల తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్.. అందరి లెక్కలు తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. జల వనరులు, అభివృద్ధి అంశాలపై విమర్శలు చేశారు. దీనికి కాంగ్రెస్ నేతలు ధీటుగా జవాబిచ్చారు. ముందు సభకు వస్తే.. అన్ని వివరాలు సభలోనే వివరిస్తామని.. ప్రభుత్వ తప్పును కూడా సభలోనే నిరూపించాలని సవాల్ విసిరారు.
ఇటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్.. 30 ఏళ్ల పాటు అధికారం మనదే అని గొప్పగా ప్రకటించారు. వై నాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో సభకు వచ్చేందుకు ముఖం చెల్లలేదు. ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే సభకు జగన్ హాజరయ్యారు. శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేసేందుకు తొలిసారి సభకు వచ్చిన జగన్.. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలప్పుడు గవర్నర్ ప్రసంగం రోజున సభకు వచ్చి.. సరిగ్గా 11 నిమిషాల తర్వాత వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ శాసనసభ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా పీపీపీ విధానంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన జగన్.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లోనే జైలులో పెడతామంటూ బెదిరించారు కూడా. దీనిపై టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. ముందు సభకు వస్తే.. అసలు పీపీపీ అంటే ఏమిటో సవివరంగా వివరిస్తామన్నారు. సభకు వచ్చే ధైర్యం లేదు కానీ.. ఇలా బయట నుంచి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read : మోదీ తర్వాత ప్రధాని పదవి ఎవరికో తెలుసా..?
ఇద్దరు మాజీ సీఎంలు కూడా సభకు వచ్చేందుకు ధైర్యం చేయటం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఏపీ కంటే తెలంగాణలో పరిస్థితి కాస్త నయం అంటున్నారు కూడా. సభకు కేసీఆర్ రాకపోయినా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం హాజరవుతూనే ఉన్నారు. కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పదేళ్ల పాలన పైన కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర ఎమ్మెల్యేలు ధీటుగానే జవాబిస్తున్నారు కూడా. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధం. సభకు జగన్ రావటం లేదు. అలాగే గెలిచిన మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు కూడా శాసనసభా సమావేశాలకు హాజరవ్వటం లేదు. వీరిలో ఓ నలుగురు మాత్రం రిజిస్టర్‌లో సంతకం పెట్టి వెళ్లిపోతున్నారని స్పీకర అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు వచ్చి కూటమి ప్రభుత్వం ఏమైన తప్పు చేస్తే.. దానిని ప్రశ్నించాలని సవాల్ విసురుతున్నారు. సభకు వస్తే.. మీ అనుమానాలు తీరుస్తామంటున్నారు కూడా. మరి ఈ సవాల్‌ను అటు కేసీఆర్, ఇటు జగన్ స్వీకరిస్తారో లేదో చూడాలి.

