పోనీలే.. లేటుగా అయినా సరే.. ఆ ప్రభుత్వం కళ్లు తెరిచింది. ప్రస్తుతం N tv విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అటు పొలిటికల్ సర్కిల్‌లో, ఇటు అధికార వర్గాల్లో కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వర్గాల ప్రజలు కూడా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుకు మద్దతు తెలుపుతున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు గతంలో వ్యవహరించిన తీరును ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా.. ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ నేతల రెండు నాల్కల ధోరణిని సోషల్ మీడియా వేదికగా నిలువునా ఎండగడుతున్నారు. అదే సమయంలో అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్, వైసీపీ చేస్తున్న కుట్రల గురించి విస్తృతంగా చర్చిస్తున్నారు కూడా.
Also Read : ట్రంప్ సంచలనం.. 75 దేశాలకు వీసా షాక్..!
అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్‌ను కూల్చడానికి బీఆర్ఎస్ నేతలు పెద్ద కుట్ర చేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇందుకు మంత్రులు, ఐఏఎస్‌ల రాసలీలలు అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇంకా చెప్పాలంటే వ్యక్తిత్వ హననానికి కూడా తెగబడ్డారు. దీంతో ఈ తప్పుడు కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ పరువుకు సంబంధించిన వ్యవహారంగా భావించి సిట్ ఏర్పాటు చేశారు. దీంతో వాస్తవాలు బయటపడ్డాయి. ఈ కుట్రలో పావుగా మారిన N tv యాజమాన్యంపైన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు విషయం అర్థం కావటం లేదు. మహిళను కించపరిచేలా కథనం ప్రసారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటే.. బీఆర్ఎస్, వైసీపీ నేతలు కడుపు మంట ఎందుకు..? మరో విచిత్రం ఏమిటంటే.. సొంత పార్టీపైన విషం చిమ్ముతున్న వారికి సీనియర్ నేత అని చెప్పుకునే జగ్గారెడ్డి మద్దతు పలకటం. సీఎం అవుతా అని పదే పదే చెప్పుకునే జగ్గారెడ్డి.. అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా..? అనేది సొంత పార్టీ నేతల మాట.
కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని జగ్గారెడ్డికి సీనియర్ అనే భావనతోనే రేవంత్ సముచిత స్థానం కల్పించారు. ఆయన భార్యను ఛైర్మన్‌ను చేశకారు. అయినా సరే.. రేవంత్ మీద, సీనియర్ మంత్రుల మీద బురద జల్లుతూ ప్రభుత్వాన్ని అస్తిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఒకవైపు, జగన్ బ్యాచ్ మరో వైపు సొంత ప్రభుత్వ పరువు తీస్తుంటే.. వైసీపీ మానసపుత్రిక N tv పైన చర్యలు తీసుకుంటే.. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా.. ఇలా తప్పుపట్టడం ఏమిటనేది జగ్గారెడ్డి అభిమానుల్లో కూడా వినిపిస్తున్న ప్రశ్నలు. సొంత కుటుంబానికి చెందిన మహిళలపై కూడా ఇలాగే అసత్య ప్రచారాలు చేస్తే.. అప్పుడు కూడా వారిని సమర్థిస్తారా..? అనే మాట వినిపిస్తోంది. N tvలో కథనం ఆధారంగా బీఆర్ఎస్, వైసీపీ పెయిడ్ యూ ట్యూబ్ ఛానల్స్ కూడా జుగుప్సాకరమైన థంబ్‌నెయిల్స్ పెట్టి మహిళలు, ప్రభుత్వ పరువు తీయటం జగ్గారెడ్డికి కనిపించటం లేదా అనేది సొంత పార్టీ నేతల మాట. జగ్గారెడ్డి కుటుంబ సభ్యులపై N tvలో ఇదే తరహా కథనం ప్రసారం అయితే.. అప్పుడు సన్మానం చేస్తారా.. లేక ధర్నా చేస్తారా.. అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న.
Also Read : తమిళ సూపర్ స్టార్ అవ్వాలనే అల్లు అర్జున్ ప్రయత్నం ఫలిస్తుందా?
ఇక్కడ సగటు టీడీపీ అభిమాని పార్టీ అధినేత చంద్రబాబు తీరును కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇందుకు రేవంత్ తీసుకున్న చర్యలే కారణం. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు ఓపికగా గమనించిన రేవంత్ రెడ్డి.. చివరికి N tvపై చర్యలతో ప్రభుత్వంపై పదే పదే బురద జల్లుతున్న మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. N tv లైసెన్స్ రద్దు చేయాలంటూ కేంద్రానికి రేవంత్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారనేది సగటు టీడీపీ అభిమాని సూటి ప్రశ్న. మాజీ మంత్రి వివేకా హత్య పై నారా సుర రక్తచరిత్ర అంటూ చంద్రబాబు చేతిలో కత్తితో ఓ పెద్ద తప్పుడు కథనం వండి వార్చినా కూడా అప్పుడు అధికారంలో ఉండి కూడా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా ప్రతిరోజూ ఎన్నో ఫేక్ వార్తలు పదే పదే ప్రసారం చేస్తున్నా కూడా.. పట్టించుకోవటం లేదు.
తెలంగాణలో T news, ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి విషపు ప్రచారాన్ని, ఆయా పార్టీల బ్రోకర్ యూ ట్యూబ్ ఛానల్స్‌ను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో సజ్జనార్ చేసిన ఆపరేషన్‌కు ప్రజల నుంచి ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇది మీడియా మీద దాడి కాదు. అలా అంటున్న వారి కళ్లను ప్రజలే తెరిపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పాత్రికేయులపై దాడులు, అక్రమ అరెస్టులను గుర్తు చేస్తున్నారు. సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణను దారుణంగా కొట్టారు వైసీపీ అభిమానులు. అలాగే అంకబాబు సహా ఎంతోమంది సీనియర్ పాత్రికేయులను వేధింపులకు గురిచేశారు. టీడీపీకి అనుకూలంగా ఉందనే ఒకే ఒక్క కారణంతో విజయవాడ నుంచి ప్రసారం అవుతున్న AP 24×7 న్యూస్ ఛానల్ మూత పడే వరకు వేధింపులకు పాల్పడింది నాటి వైసీపీ ప్రభుత్వం. ఇంత జరిగినా కూడా.. వైసీపీ అనుకూల మీడియాపైన టీడీపీ అధినేత చంద్రబాబు, కూటమి సర్కార్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందనేది ఇప్పటికీ అర్థం కానీ ప్రశ్న. N tvపై చర్యలతో రేవంత్ సర్కార్ ధైర్యంగా ముందుకు అడుగు వేసింది. రేవంత్ బాటలో వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న అరాచకాలను చంద్రబాబు అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చిందని సగటు టీడీపీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

