Wednesday, February 4, 2026 09:38 AM
Wednesday, February 4, 2026 09:38 AM

ఏబీవి రాజకీయ అడుగు: ఒత్తిడి వ్యూహమా లేక స్వతంత్ర ప్రయాణమా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడంతో, ప్రధానంగా ఆయన ఏ పార్టీలో చేరతారన్న దానిపై ఇప్పటివరకు చర్చ సాగింది.

మొదట్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయనకు ఒక నామినేటెడ్ పదవిని కూడా ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పదవి తన అనుభవం, స్థాయికి తగినది కాదన్న అభిప్రాయంతో పాటు, గతంలో తాను కోల్పోయిన ఉద్యోగ గౌరవానికి సమానంగా లేదని భావించి ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ఆయనతో అనుబంధం ఉన్నవారు చెబుతున్న మాట. అయితే, రాజకీయ పార్టీ ఏర్పాటు అంశంపై మాత్రం ఆయన పలుమార్లు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. తాజాగా పార్టీ స్థాపనకు అవసరమైన అన్ని వనరులు సిద్ధమయ్యాయని చెబుతూ, కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంటున్నారు.

Also Read : టీటీడీపై ఫారెనర్‌ వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్..!

ఏబీ వెంకటేశ్వరరావు సీనియర్ ఐపీఎస్ అధికారి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన డీజీపీ స్థాయికి పదోన్నతి పొందాల్సిన అధికారి అన్న అభిప్రాయం ప్రజల్లో అప్పట్లో విస్తృతంగా వ్యక్తమైంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు పదోన్నతి లభించకపోవడమే కాకుండా, ఎలాంటి కీలక పోస్టింగ్ కూడా ఇవ్వకుండా దీర్ఘకాలం పక్కన పెట్టిన పరిస్థితి ఎదురైంది. పక్కన పెట్టడమే కాకుండా.. ఆధారం లేని కేసులు పెడుతూ ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. చివరకు ఆయన కొడుకు పైన కూడా కేసులు పెట్టేవరకు వచ్చారు. అయితే జగన్ సర్కార్ పై పట్టువదలని విక్రమార్కుడిలా న్యాయ పోరాటం కొనసాగించి, న్యాయస్థానం ఆదేశాల మేరకు పదవీ విరమణ రోజున విధుల్లో చేరి గౌరవంగా పదవీ విరమణ చేశారు.

ఈ పరిణామాలను ఆయన తనకు జరిగిన అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి వచ్చి, తగిన స్థాయి రాజకీయ ప్రాధాన్యం లేదా బాధ్యత దక్కుతుందని ఆయన ఆశించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీలో చేరతారని టీడీపీ అభిమానాలు ఆశించారు. కానీ చివరికి స్వతంత్రంగా పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని అంచనా.

Also Read : ఆ జిల్లా నేతలపై చంద్రబాబు గుర్రు..!

ఇటీవలి కాలంలో ఏబీ వెంకటేశ్వరరావు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, మెగా ఇంజినీరింగ్ వంటి సంస్థల పై తక్షణమే విచారణలు, చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అయితే, ఈ విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం నెమ్మదిగా వ్యవహరిస్తోందన్న అసంతృప్తిని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ అంశాలపై ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయ, న్యాయపరమైన సంక్లిష్టతలను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో, ఏబీ వెంకటేశ్వరరావు కొత్త పార్టీ ప్రకటన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.

మొత్తంగా, ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయ ప్రవేశం, కొత్త పార్టీ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంత మేర ప్రభావం చూపుతుందన్నది రానున్న రోజుల్లో స్పష్టత పొందనుంది. ఆయన పార్టీకి ప్రజల్లో ఎంత స్థాయి మద్దతు లభిస్తుందో, ప్రధాన రాజకీయ పార్టీలపై అది ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్