భారత్‌లో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం, వైసర్, క్యూబిట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్వాంటం ప్రోగ్రామ్‌లో భాగంగా “క్వాంటం టాక్ బై సీబీఎన్” కార్యక్రమాన్ని వేలాది టెక్ విద్యార్థులతో నిర్వహించారు. డిజిటల్ మాధ్యమం ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి, క్వాంటం టెక్నాలజీపై రాష్ట్రం రూపొందించిన విజన్‌ను యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి నిపుణులు, ఐబీఎం, క్యూబిట్ సంస్థల ప్రతినిధులు, వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Also Read : నోరు జారితే వీసా పోయినట్టే.. సోషల్ మీడియాపై గురి..!
క్వాంటం మెకానిక్స్, అల్గారిథమ్స్‌లో 10 లక్షల మంది, క్వాంటం సాఫ్ట్‌వేర్–హార్డ్‌వేర్ రంగాల్లో 3 లక్షల మంది, అడ్వాన్స్‌డ్ రీసెర్చ్‌లో లక్ష మంది నిపుణులను తయారు చేయడమే లక్ష్యమని సీఎం వెల్లడించారు. ఐటీ విప్లవం సమయంలో హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చిన అనుభవాన్ని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు విశాఖ డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని తెలిపారు. అమరావతిని నాలెడ్జ్ ఎకానమీ, క్వాంటం వ్యాలీగా, తిరుపతిని స్పేస్ సిటీగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Also Read : తిరుమలలో మరో భారీ స్కామ్.. 50 కిలోల బంగారం మాయం!
అమరావతిలో క్వాంటం ఎకోసిస్టమ్ ద్వారా పరిశోధనలు నోబెల్ స్థాయికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. క్వాంటం టెక్నాలజీ ద్వారా వైద్యం, విద్యుత్, వ్యవసాయం, ఫైనాన్షియల్ మోడలింగ్, వాతావరణ అంచనాలు వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని వివరించారు. ఏపీ నుంచి ఎవరైనా క్వాంటం పరిశోధనల ద్వారా నోబెల్ బహుమతి సాధిస్తే రూ.100 కోట్ల ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే క్వాంటం కంప్యూటింగ్ పరికరాల తయారీ ప్రారంభిస్తామని తెలిపారు.
మూడు దశాబ్దాల క్రితం ఐటీ విజన్‌తో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టినట్టే, ఇప్పుడు అమరావతిని భారత్‌కు క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. విజ్ఞానం భారతీయుల డీఎన్ఏలోనే ఉందని, ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్లు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి సహా పలువురు ప్రముఖ నిపుణులు పాల్గొన్నారు.

