పోలవరం ప్రాజెక్టు.. 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన అతి పెద్ద ప్రాజెక్ట్. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. ముంపు మండలాలు ఏపీలో విలీనం, బడ్జెట్‍లో నిధుల కేటాయింపు.. పనుల పురోగతిపై ఏపీ సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ.. వెరసి ప్రాజెక్టు పనులు శరవేగంగా పరిగెత్తాయి. 2014-2019 మధ్య కాలంలో ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు.
Also Read : టీడీపీపై మోదీ సవతి ప్రేమ..?
అయితే 2019లో అధికారంలోకి వచ్చిన రివర్స్ టెండర్ పేరుతో కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. కాంట్రాక్టర్‌ను మార్చేసింది. ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేసింది. డ్యామ్ ఎత్తు తగ్గించేలా చర్యలు చేపట్టింది. దీంతో పనులు నిలిచిపోయాయి. ఇదే సమయంలో వరదలు రావడం.. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాఫర్ డ్యామ్ కొట్టుకు పోయింది. దీని వల్ల ప్రాజెక్టు పనులు నత్తతో పోటీపడ్డాయి. వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన ఇద్దరు ఇరిగేషన్ మంత్రుల తీరు కూడా పోలవరం పాలిట శాపంగా మారింది. అసెంబ్లీ వేదికగా అయ్యప్ప దీక్షలో ఉన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారని నాటి ప్రతిపక్ష టీడీపీ నేతలు వేసిన ప్రశ్నకు.. 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ.. 2023 జనవరిలలో ఆయన పదవీ ఊడిపోయే వరకు కూడా ప్రాజెక్టు అతీగతీ లేకుండా పోయింది.
ఇక అనిల్ తర్వాత బాధ్యతలు చేపట్టిన మరో సీనియర్ నేత అంబటి రాంబాబు అయితే.. అసలు పోలవరం ప్రాజెక్టు అంటే నాకే అర్థం కాలేదు.. ఇంక మీకు ఏం చెప్పాలి అంటూ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు పోలవరం ప్రాజెక్టుపై ఉన్న చిత్తశుద్ధిని బయటపెట్టాయి. చివరికి ఏపీ ప్రజల జీవనాడిగా గుర్తింపు తెచ్చుకున్న పోలవరం పనులు వైసీపీ పాలనలో వంద అడుగులు వెనక్కి వెళ్లినట్లు అయ్యింది. ఇక 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిపైనే దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఓ వైపు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ జీవనాడి, కోట్లాది మంది రైతుల చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు పనుల్లో కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితి తొలగిపోయి, ఇప్పుడు నూతనోత్సాహం ఉరకలెత్తుతోంది.
Also Read : అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్.. కేసీఆర్, జగన్ కు చురకలు..!
అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన, గ్యాప్-1, గ్యాప్-2 డ్యాం పనులపై వారు ఇచ్చిన సూచనలు ప్రాజెక్టు భవిష్యత్తుపై గట్టి భరోసా ఇస్తున్నాయి. ముఖ్యంగా డయాఫ్రం వాల్ పనులు వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామన్న అధికారుల ప్రకటన రాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద ఊరట. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైన సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో ఐఐటీ తిరుపతి నిపుణుల కృషి అభినందనీయం. గతంలో డయాఫ్రం వాల్ నిర్మాణంలో తలెత్తిన ‘బ్లీడింగ్’ వంటి క్లిష్ట సమస్యలను ఐఐటీ నిపుణులు సూచించిన వినూత్న మెథడాలజీ ద్వారా అధిగమించడం విశేషం. విదేశీ నిపుణులు సైతం ఈ పనుల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం మన దేశీయుల సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. నిలిచిపోయిన పనులను పరుగులు పెట్టించడం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ విదేశీ నిపుణులను రప్పించడం వెనుక చంద్రబాబు పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది. సాంకేతిక లోపాలు ఉండకూడదనే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయి సలహాలు తీసుకుంటూ.. షీప్ ఫుట్ రోలర్ల వినియోగం, పారదర్శకతతో ముందుకు సాగడం ప్రాజెక్టు మనుగడకు అత్యంత కీలకం.
Also Read : దావోస్‌లో ‘టీమ్ ఏపీ’ దూకుడు.. రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులు
డయాఫ్రం వాల్ అనేది డ్యాం నిర్మాణంలో అత్యంత కీలకమైన భాగం. ఇది పూర్తయితే ప్రధాన డ్యాం నిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది. ఫిబ్రవరి గడువులోగా ఈ పనులు పూర్తయితే, అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. విదేశీ నిపుణుల సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ, పక్కా డాక్యుమెంటేషన్‌తో పనులు జరిపితే, ఆటంకాలు లేని పోలవరం సాకారం కావడం తథ్యం.

