Sunday, March 22, 2026 03:00 AM
Sunday, March 22, 2026 03:00 AM

నా పేరు వాడితే.. అంతే సంగతులు..!

కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు ఇప్పుడు పదేపదే వినిపిస్తోంది. గుంటూరు పార్లమెంట్ ‌నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన పెమ్మసాని.. అనూహ్యంగా 3 లక్షల 44 వేల పై చిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే గుంటూరు పార్లమెంట్ పరిధిలో తనదైన శైలిలో ప్రచారం చేశారు పెమ్మసాని. తన గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేస్తూ.. పార్లమెంట్ వ్యాప్తంగా “పెమ్మసాని అనే నేను..” అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఓ వైపు వైసీపీ అధినేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వై నాట్ 175 అని ప్రచారం చేస్తున్నారు. 25 పార్లమెంట్ స్థానాలు గెలుస్తున్నామని గొప్పగా ప్రకటిస్తుంటే.. పెమ్మసాని మాత్రం.. తన గెలుపు ఖాయమన్నట్లుగా నియోజకవర్గం మొత్తం ఫ్లెక్సీలు వేయడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది కూడా.

పెమ్మసానిపై అప్పట్లో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ పెమ్మసాని.. నామినేషన్ వేశామా.. డబ్బులు ఖర్చు చేశామా.. ఎన్నికల్లో పోటీ చేశామా.. ఓడిపోయామా.. తిరిగి అమెరికా వెళ్లిపోయామా అన్నట్లుగా ఉండాలంటూ సెటైర్లు కూడా వేశారు. ఇంటి పేరుతో కూడా విమర్శలు చేశారు. అయినా సరే.. పెమ్మసాని మాత్రం వెనుకడుగు వేయలేదు. ఇక ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు ప్రకటించిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తన మొత్తం ఆస్తుల విలువను 5 వేల 700 కోట్లుగా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆయనకు 2 వేల 316 కోట్ల విలువైన చరాస్తులుండగా.. భార్య శ్రీరత్న పేరిట 2 వేల 280 కోట్ల చరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ చెరో 12 వందల కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. చెరో 519 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. అమెరికాలో కూడా 28.26 కోట్ల విలువైన నివాస భవనాలు ఉన్నట్లు తెలిపారు.

Also Read : జిల్లా ఏర్పాటు సరే.. మరి వాటి సంగతి..?

ఎన్నికల్లో గెలిచిన తర్వాత అనూహ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్‌ను కేంద్ర మంత్రి పదవి వరించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన పనితీరుపై ఇప్పటి వరకు ఎలాంటి విమర్శలు రాలేదు. ఇదే సమయంలో తన పార్లమెంట్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు పెమ్మసాని. కీలకమైన ఆర్వోబీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, రైల్వే స్టేషన్‌ల అభివృద్ధి.. ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా కొందరు చంద్రశేఖర్‌ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పెమ్మసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

పెమ్మసాని పేరుతో ఓ టిప్పర్ లారీ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొందరు వైసీపీ నేతలు.. ఇసుక, మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఘాటుగా బదులిచ్చారు పెమ్మసాని. తన ఇంటి పేరు ఉన్న టిప్పర్ లారీ ఫోటోను సోషల్ మీడియాలో ఆయనే పోస్ట్ చేశారు. “ప్రజా గమనిక” పేరుతో ప్రకటన జారీ చేశారు. “తప్పుడు ప్రచారంపై హెచ్చరిక.. డా.పెమ్మసాని చంద్రశేఖర్‌కు భారత్‌లోని ఏ ట్రక్కింగ్ లేదా లాజిస్టిక్స్ కంపెనీలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఏ కంపెనీని నడపడం, నియంత్రించడం, ప్రోత్సహించడం లేదా మద్దతు ఇవ్వడం చేయడం లేదు. అలాగే, రియల్ ఎస్టేట్, మైనింగ్, రవాణా లేదా అనుబంధ రంగాల్లో ఆయనకు ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవు. ఎక్కడైనా ప్రచారం అవుతున్న ఏ ప్రకటనలు, చిత్రాలు, ప్రచార సమాచారం లేదా ఆరోపణలు పూర్తిగా అబద్ధమైనవి, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. ఇవి ఆయన గౌరవం, ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతో చేసిన చర్యలుగా పరిగణించబడతాయి. డా.పెమ్మసాని చంద్రశేఖర్ ఏ అక్రమ లేదా అనైతిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వరు, సహించరు కూడా. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని మనవి చేస్తున్నాం. ఆయన పేరు లేదా ప్రతిష్ఠను అనధికారికంగా వినియోగించిన వారిపై, ముందస్తు సమాచారం లేకుండానే, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇలాంటి తప్పుడు లేదా మోసపూరిత సమాచారాన్ని ఎవరైనా గమనిస్తే, తక్షణమే మా కార్యాలయానికి తెలియజేయగలరు.” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read : ఏపీ వారికి రేవంత్ సంక్రాంతి గుడ్ న్యూస్..!

నిజానికి పెమ్మసానికి ఇండియాలో ఎలాంటి వ్యాపారాలు లేవు. అమెరికాలో మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం తాను స్వయంగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్‌ను చాలా తక్కువ ఖర్చుకు ఆన్‌లైన్‌లో అందించారు. దీనికి మంచి ఆదరణ దక్కడంతో ఆ మెటీరియల్‌కు మంచి డిమాండ్ వచ్చింది. నాటి నుంచి వైద్య విద్యార్థుల కోసం యు వరల్డ్ పేరుతో సంస్థ స్థాపించిన పెమ్మసాని.. ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో నర్సింగ్‌, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ఇప్పటికీ ఇదే ఆయన ప్రధాన ఆదాయ వనరు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్