కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే.. అందుకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ మాత్రమే. ప్రస్తుతం ఎన్‌డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ తర్వాత పెద్ద పార్టీ ఏదీ అంటే అది తెలుగుదేశం మాత్రమే. దేశ వ్యాప్తంగా బీజేపీకి 240 స్థానాలు దక్కగా.. ఏపీలో టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేసి 16 చోట్ల విజయం సాధించింది. ఏపీలో బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేయగా 3 చోట్ల మాత్రమే గెలవగా.. మిగిలిన 3 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 3 స్థానాల్లో అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ గెలిచారు. ఈ మూడు కూడా టీడీపీ, జనసేన పొత్తు వల్ల సాధ్యం అనేది బహిరంగ రహస్యం.
Also Read : అమరావతిపై కేంద్ర కేబినెట్ కీలక అడుగులు..!
కేంద్రంలో టీడీపీ తర్వాత జనతా దళ్ 12, శివసేన 7 స్థానాలతో ఉన్నాయి. ఎన్‌డీఏ సర్కార్ ఏర్పాటులో కీలకంగా మారిన టీడీపీ నుంచి ప్రస్తుత మోదీ క్యాబినెట్‌లో కేవలం ఇద్దరు మాత్రమే కేంద్ర మంత్రులున్నారు. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు మంత్రిపదవులు దక్కాయి. అదే సమయంలో నరసాపురం నుంచి బీజేపీ తరఫున గెలిచిన శ్రీనివాసవర్మకు కూడా సహాయమంత్రిగా అవకాశం దక్కింది.
అయితే కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పై ప్రధాని మోదీ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారా.. అనే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా సరే.. టీడీపీకి మరో మంత్రి పదవి ఖాయమంటున్నారు. అది కూడా క్యాబినెట్ హోదా నా లేక.. స్వతంత్ర శాఖ స్టేట్ మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఎన్‌డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి ఒక క్యాబినెట్ హోదా పదవిని ఇచ్చారు. ప్రాధాన్యత లేని పౌర విమానాయాన శాఖ మంత్రిత్వ శాఖను రామ్మోహన్ నాయుడుకు కేటాయించారు మోదీ. అదే సమయంలో రామ్మోహన్‌ను బీజేపీ అనుకూల మీడియా పదే పదే టార్గెట్ చేస్తోంది. దీని వెనుక కేంద్ర పెద్దలున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read : దావోస్‌లో ‘టీమ్ ఏపీ’ దూకుడు.. రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులు
అటు రామ్మోహన్‌కరు, ఇటు పెమ్మసానికి ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చినా సరే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు మౌనంగా అంగీకరించారనే మాట పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. నిజానికి గతంలో విమానయాన శాఖ పరిధిలో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా సన్స్ సంస్థ కొనుగోలు చేయడంతో ప్రైవేటు పరం అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆ శాఖకు అంతగా విలువ లేదు. ఇక కేంద్రంలో సహాయ మంత్రులకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇంకా చెప్పాలంటే.. రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్‌లు ఉన్నట్లుగా ఓ కార్యాలయం, కూర్చునేందుకు కూర్చి మాత్రమే ఉంటుంది. అంతే తప్ప.. కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌కు నో ఎంట్రీ.
విలువ లేని, కేవలం అలంకార ప్రాయమైన పదవులు కేటాయించినా సరే.. చంద్రబాబు సైలెంట్‌గా ఉన్నారు. ఇక ఏపీలో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీకి ఇద్దరు ఎంపీలున్నారు. వారిలో ఒకరికి కూడా స్టేట్ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. నిజానికి ఎన్‌డీఏ సర్కార్‌లో చిన్న చిన్న పార్టీలకు కూడా విలువ ఇస్తున్న మోదీ.. టీడీపీ విషయంలో మాత్రం చిన్న చూపు చూస్తున్నారు. తాజాగా టీడీపీకి మరో మంత్రి పదవి అంటూ లీకులు ఇస్తున్నారు కేంద్ర పెద్దలు. ఒక వేళ టీడీపీకి క్యాబినెట్ హోదా పదవి ఇస్తే.. జనసేనకు సహాయ మంత్రి పదవి వస్తుందా అనే చర్చ నడుస్తోంది.
Also Read : అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్.. కేసీఆర్, జగన్ కు చురకలు..!
ఇక త్వరలో జరగనున్న తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయా రాష్ట్రాలపై మోదీ సర్కార్ వరాల జల్లు కురిపిస్తోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లతో పాటు అమృత్ భారత్ రైళ్లను కూడా ఈ రెండు రాష్ట్రాలకే ఎక్కువగా కేటాయించారు. ఇది ఏపీ ప్రజల పట్ల కేంద్రం చూపిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి ఎన్‌డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు అధికారికంగా ప్రారంభం కాలేదు. కూటమి సర్కార్ భూమి కేటాయించి ఏడాది దాటినా కూడా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి.
కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పార్టీల పై ఆధారపడి మనుగడ సాగిస్తున్నా కూడా అంత కృతజ్ఞత చూపించటం లేదని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇదే సమయంలో గతంలో కేంద్ర సర్కార్ కు అన్ని విధాలుగా అండగా నిలిచిన జగన్ రెడ్డికి మోదీ అన్ని విధాలా సహకరిస్తున్నారా.. అనే అనుమానం కూడా వినిపిస్తోంది. నిజానికి మరోసారి కేంద్ర పెద్దలతో చంద్రబాబు ఎలాంటి పోరాటం చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ప్రస్తుతం అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అయితే కేంద్ర పదవులు కేటాయించడం ద్వారా టీడీపీ బలపడుతుందనే భయం మాత్రం బీజేపీ అగ్రనేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్‌డీఏలో చక్రం తిప్పిన చంద్రబాబు.. మరోసారి అలా చేస్తారనే భయంతోనే పెత్తనం మొత్తం ఏకపక్షంగా బీజేపీ చేతుల్లోనే ఉందనే మాట వినిపిస్తోంది. మరి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్న చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

