“పొత్తు కొనసాగుతుంది.. మరో 15 ఏళ్లు కలిసే ఉంటాం.. సీఎం కుర్చీలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడే ఉంటారు..” ఈ వ్యాఖ్యలు చేసింది డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. అది కూడా శాసనసభ సాక్షిగా ఈ విషయం ప్రకటించారు. దీంతో కిందస్థాయిలో కార్యకర్తలు, నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా కూడా పొత్తు విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ రావడంతో.. ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కిందిస్థాయిలో ఇలాంటి పొరపొచ్చలు సహజమే అయినప్పటికీ… పై స్థాయిలో మాత్రం కలిసిమెలిసే ఉన్నామని… ఉంటామని కూడా ఆ పార్టీల నేతలు సర్థుకుపోయారు.
Also Read :ప్రజాక్షేత్రంలోకి జగన్.. జవాబు చెప్పాలన్న టీడీపీ..!
అయితే పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్‌తో పాటు ఆయన సోదరుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ముందుగా పవన్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలం రేపాయి. పిఠాపురంలో పవన్ గెలుపు పూర్తిగా తమ క్రెడిట్ అన్నట్లుగా నాగబాబు వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేతగా పవన్‌ను పిఠాపురం ప్రజలు ఆదరించారన్నారు. అదే సమయంలో పవన్ గెలుపు కోసం జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారన్నారు. అంతటితో ఆగకుండా… పవన్ గెలుపు తమ వల్లే అని ఎవరైనా అనుకుంటే.. అది వారి ఖర్మ అంటూ నాగబాబు వ్యాఖ్యానించడం టీడీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు పవన్‌కు కేటాయించినప్పుడు.. అక్కడ టీడీపీ ఇంఛార్జ్ వర్మతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వర్మ లేకపోతే తన గెలుపు సాధ్యం కాదని గొప్పగా చెప్పారు కూడా. కానీ ఇప్పుడు మాత్రం నాగబాబు వ్యాఖ్యలు కొంత ఇబ్బందికి గురి చేసింది.
Also Read :ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. వాళ్ళతో లింకులు ఉంటే అంతే..!
ఇక పవన్ కూడా టీడీపీ గెలుపుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఎన్నికల్లో గెలిచాం… మనం నిలబడ్డాం.. నాలుగు దశాబ్దాల చరిత్రగల టీడీపీని కూడా నిలబెట్టాం.. అంటూ పవన్ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి 40 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది జనసేన. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన కేవలం ఒకటే సీటు గెలిచింది. చివరికి పవన్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో గెలవగా.. టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ పది స్థానాల్లో పోటి చేసి 8 గెలిచింది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి గెలిచింది. టీడీపీ మాత్రం ఏకంగా 135 స్థానాల్లో విజయం సాధించింది. వాస్తవంగా చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ గ్రాఫ్ భారీగా పెరిగింది. ఒంటరిగా పోటీ చేసినా సరే వంద నుంచి 120 స్థానాలు వస్తాయని అప్పట్లో సర్వే నివేదికలు వెల్లడయ్యాయి కూడా. మరి అంత పటిష్ఠమైన స్థితిలో ఉన్న టీడీపీని నిలబెట్టామని పవన్ చెప్పడం పట్ల తెలుగు తమ్ముళ్లు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. యువగళం పాదయాత్ర, చంద్రబాబు అరెస్టు వల్లే కూటమి గెలిచిందనే విషయం పవన్ మర్చిపోయారా అని వ్యాఖ్యానిస్తున్నారు. అలయెన్స్‌లో ఉన్నప్పుడు ఈ వైఖరి మంచిది కాదంటున్నారు.




