తెలుగుదేశం పార్టీలో సింగిల్ టైం ఎమ్మెల్యేలకు ఫుల్ క్లారిటీ వచ్చినట్లుంది. నియోజకవర్గంలో సీనియర్లను కాదని టికెట్ సాధించారు. పార్టీ అండతో ఘన విజయం సాధించారు. ఇక అంతే.. సీనియర్లను పక్కన పెట్టేశారు. నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలకు తెర లేపారు. కార్యకర్తలకు కనీస విలువ ఇవ్వటం లేదు. ఇంకా చెప్పాలంటే.. నియోజకవర్గంలో నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇలాంటి నేతల తీరు ఇప్పుడు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. చివరికి అధినేత స్వయంగా రంగంలోకి దిగారు. మరోసారి ఇలాగే వ్యవహరిస్తే.. తాట తీస్తా అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు.
Also Read : త్రిషాతో రిలేషన్.. విజయ్ ఫుల్ క్లారిటీ..!
2024 ఎన్నికల్లో సీనియర్లను కాదని చాలా మంది కొత్త వారికి టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. వారి గెలుపు బాధ్యతలను పాత వారికి అప్పగించారు. అదే సమయంలో పార్టీ అధినేత నిర్ణయం మేరకు సీట్లు త్యాగం చేసిన వారికి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదు. ఇదే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అలుసుగా మారింది. దీంతో నియోజకవర్గంలో రెచ్చిపోతున్నారు. సీనియర్లను ఏ మాత్రం లెక్క చేయటం లేదు. చివరికి కార్యకర్తలను కూడా పట్టించుకోవటం లేదు. ఈ విషయం తెలుసుకున్న అధినేత చంద్రబాబు.. ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పుడు ఇదే విషయంపై సీరియస్‌గా ఉన్నారు.
రెండు రోజుల క్రితం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేతలతో పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అధికారులతో దురుసుగా ప్రవర్తించడం ఏమిటని నిలదీశారు. సమస్యలు తెలిపేందుకు వచ్చిన ప్రజలను తిట్టడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే మొదటి సారి ఎన్నికైన శ్రీకాకుళం, పాతపట్నం ఎమ్మెల్యేల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ముఖ్యంగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Also Read : మావిగన్ పై తిట్లేనా..? చేసే అభివృద్ధి చెప్పుకోలేరా..?
పాతపట్నం నియోజకవర్గంలో సీనియర్ నేత కలమట వెంకటరమణను కాదని మీకు ఇచ్చాను అనే విషయం మర్చిపోయారా.. అని నిలదీశారు. పార్టీ నేతలను కలుపుకుని వెళ్లడానికి ఏమిటి ఇబ్బంది అని ప్రశ్నించారు. కార్యకర్తలను పట్టించుకోకుండా వ్యాపారాలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. వ్యాపారాలు ముఖ్యమైతే ప్రజా సేవలోకి ఎందుకు వచ్చారన్నారు. కార్యకర్తలను పట్టించుకోకపోతే.. నీ పైన పార్టీ కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రవర్తన, మాటతీరు మార్చుకోకపోతే ఇబ్బంది పడతావన్నారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం.. పార్టీకి ఇబ్బంది కలిగేలా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదన్నారు. ఎన్నికల్లో గెలుపు మీ సొంత ప్రతిభ కాదని.. అది కార్యకర్తల కష్టమన్నారు. మొదటిసారి గెలిచిన వారు ఎంత అణకువతో ఉండాలో తెలియదా.. అని వార్నింగ్ ఇచ్చారు.
మామిడి గోవిందరావు తీరుపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సీనియర్ కలమటకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి రాకపోవడంతో.. ఆయన వర్గం నేతలపై మామిడి గోవిందరావు నోరు పారేసుకుంటున్నారు కూడా. మీ నాయకుడికే దిక్కులేదు.. ఇక మీ పరిస్థితి ఏమిటీ అని వెటకారంగా మాట్లాడుతున్నారు. నియోజకవర్గంలో తన మాటే ఫైనల్ అని.. తన మాట వినికపోతే ఏం జరుగుతుందో తెలుసా అని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఈ విషయాలన్నీ మంత్రి లోకేష్ వరకు చేరాయి. దీంతో మామిడి గోవిందరావు తీరుపై లోకేష్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉండే ఉండు.. పోతే పో.. అని వార్నింగ్ ఇచ్చేశారు. అసలు నీకు టికెట్ ఇప్పించిన అచ్చెన్నాయుడును అనాలి.. ఎవరెలాంటి వాళ్లో తెలుసుకోకుండా టికెట్ ఇప్పించారు. ముందు ఆయనకు బుద్ధి లేదు.. అని లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వ్యవహారం తెలుగుదేశం పార్టీ నేతలకు తలనొప్పిగా మారిందనే మాట వినిపిస్తోంది.

