రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతాల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఒకటి. ఎంతోమంది రాజకీయ అపర చాణుక్యులు ఈ జిల్లాకు చెందిన వారే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చక్రం తిప్పిన నేతలున్నారు. ఇక ఎర్రన్నాయుడు, కృపారాణి వంటి నేతలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కూడా. ఇలాంటి జిల్లాలో వైసీపీ పూర్తిగా చతికిలపడిపోవడానికి ప్రధాన కారణం నేతల మధ్య సమన్వయలోపమే. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతీయ పార్టీలో కూడా రీజనల్ కో ఆర్డినేటర్ అనే పదవి లేదు. ఒక్క వైసీపీలో మాత్రమే ఆ పదవి ఉన్నప్పటికీ… నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం కారణంగా.. గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. విజయసాయిరెడ్డి వంటి సీనియర్ నేత కూడా నేతల మధ్య సమన్వయం సాధించడం చేతకాక చేతులెత్తేశారు. చివరికి ఒంటెద్దు పోకడలతో పార్టీ ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు కూడా. విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్‌గా జగన్ నియమించారు. రాజకీయ చైతన్యం ఉన్న శ్రీకాకుళం జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ నేతల మధ్య సయోధ్య కుదిరించడం కన్నబాబుకు కత్తి మీద సాము అంటున్నారు స్థానిక నేతలు.
Also Read : రాకున్నా.. వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారేమిటో…!
రీజనల్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన కన్నబాబు… తొలిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని వైసీపీ నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే జిల్లా వైసీపీలో నేతలకు, కార్యకర్తలకు మధ్య సమన్వయ లోపం కారణంగానే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు భారీ తేడాతో ఓడిపోయారు. కొత్త అభ్యర్థుల చేతుల్లో వైసీపీ సీనియర్లు కూడా ఘోరంగా ఓడిపోయారు. గతంలో వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి నేతలు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. అలాగే ఇంఛార్జ్‌గా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కొద్ది రోజులు పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించారు. అయినా కూడా నేతల మధ్య సమన్వయం సాధించలేక చేతులెత్తేశారు. ఇదే సమయంలో ఎవరి వారు సొంతంగా గ్రూపు రాజకీయాలు నిర్వహించారు కూడా. దీంతో సమాంతరంగా కొత్త నాయకత్వం తెరపైకి రావడంతో… నేతల మధ్య ఆధిపత్యపోరు తలెత్తింది.
Also Read : గతం మర్చిపోయి పరువు పోగొట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే..!
శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ నేతల్లో గ్రూపులున్నాయి. అన్నిచోట్లా కూడా సమన్వయం లేకపోగా… బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకటి రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల గ్రూపులున్నాయి. నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. శ్రీకాకుళం, నరసన్నపేట మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా సీనియర్ల మాటను కూడా కిందిస్థాయి కార్యకర్తలు లెక్కచేయటం లేదు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కాదని ఆమదాలవలస ఇంఛార్జ్‌గా చింతాడ రవిని నియమించారు జగన్. అటు ఇచ్ఛాపురంలో ఇప్పటికీ సరైన నాయకత్వం లేదు. పలాసలో మాజీ మంత్రి అప్పల్రాజుపై స్థానిక వైసీపీ నేతలే గుర్రుగా ఉన్నారు. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు, మరో నేత పేరాడ తిలక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట లెక్క చేసే నాధుడే కరువయ్యాడు. పాలకొండలో కూడా విశ్వసరాయి కళావతిపై స్థానిక కేడర్ గుర్రుగా ఉంది. దీంతో అన్ని తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరించే జిల్లా పార్టీని రీజనల్ కో ఆర్డినేటర్ గాడిలో పెట్టగలరా అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. వైసీపీ తిరిగి గెలవాలంటే ఇప్పుడున్న నేతలను మార్చాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది. మరి ఆ దిశగా సమన్వయకర్త కురసాల కన్నబాబు చర్యలు తీసుకుంటారా… లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

