తిరువూరు నియోజకవర్గ పంచాయతీకి ముగింపు పలికేందుకు.. ఓవైపు అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని వివాదానికి త్వరగా ముగింపు పలకాలని ఇటీవల ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇక రెండు రోజుల క్రితం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని పల్లా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయానికి పిలిచారు.
Also Read : ఎమ్మార్వో ఆఫీస్ కు మాగంటి ఫ్యామిలీ పంచాయతీ..!
ఈ సందర్భంగా ఇద్దరు నేతలతో పల్లా మాట్లాడారు. విభేదాలు పక్కనపెట్టి ముందుకు వెళ్లాలని ఆయన సూచించగా.. కలిసి ముందుకు వెళ్లడం సాధ్యం కాదని ఇద్దరు నేతలు చెప్పినట్లు ప్రచారం జరిగింది. తనను టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడంపై చిన్ని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందు నుంచి దూకుడు స్వభావంతో ఉండే కొలికపూడి చిన్ని విషయంలో కూడా అదే విధంగా విమర్శలు చేశారు. ఇది ఇలా ఉంచితే తాజాగా మరో సంచలనానికి తిరువూరు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాలతో నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహించేందుకు ఆయన సిద్ధమయ్యారు.
Also Read : వైసీపీ నేతలతో పిల్లల్ని పంపకండి.. అనిత సంచలన కామెంట్స్
సాధారణంగా నియోజకవర్గాల్లో ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ కార్యక్రమాలలో ఎంపీ ఫోటో ఉండటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇతర నేతల ఫోటోలు కూడా ఉంటాయి. కానీ తాజాగా కోలికపూడి మాత్రం ఎంపీ ఫోటో లేకుండానే.. కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపు తిరువూరులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అయితే ఎంపీ ఫోటోలు వద్దని, ఇతర నేతల ఫోటోలు మాత్రమే ఉండాలని కొలికపూడి పార్టీ నేతలకు సూచించడం వివాదాస్పదమైంది. కొంతమంది నేతలకు కూడా ఆయన ఫోన్ చేసి ఎంపీ ఫోటోలు వాడ వద్దని చెప్పడం గమనార్హం. ఓవైపు ఇద్దరి మధ్య రాజీ కోసం అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంటే ఎమ్మెల్యే కొలికపూడి మాత్రం తన వైఖరి వీడటం లేదు.

