ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా, మైదానంలో చెన్నై స్టార్ ఆటగాడు.. ఎంఎస్ ధోనీ మెరుపులు చూడాలని ఆశపడుతున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. కాళ్ల కండరాల గాయం కారణంగా ఇప్పటికే మూడు మ్యాచ్లకు దూరమైన ధోనీ, మరికొన్ని మ్యాచ్ లకు కూడా అందుబాటులో ఉండడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 11న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగనున్న మ్యాచ్ కూ ధోనీ అందుబాటులో ఉండటం లేదు.
Also read : షాకింగ్.. బెజవాడ ఉగ్ర లింకుల్లో భారీగా అమ్మాయిలు..!
ఇప్పటికే మూడు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న చెన్నైకి ఇది కోలుకోలేని దెబ్బ. ధోనీ ఇంకా చికిత్స తీసుకుంటున్నాడు అని.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి కనీసం మరో వారం రోజులు పట్టవచ్చని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. ధోనీ తిరిగి ఎప్పుడు బ్యాట్ పడతాడనే దానిపై ఫ్రాంచైజీ ఒక క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 18న కోల్కతా నైట్ రైడర్స్ తో జరగబోయే మ్యాచ్ నాటికి ధోనీని సిద్ధం చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
Also Read : డయాబెటిస్ రోగులకు ఊరట.. అమెరికా మార్కెట్లోకి జైడస్ కొత్త షుగర్ మందు..!
44 ఏళ్ల వయసులో గాయం తీవ్రత పెరగకుండా ఉండటానికి, మేనేజ్మెంట్ ఎటువంటి రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. అందుకే ఆయనను పూర్తిస్థాయిలో కోలుకున్నాకే బరిలోకి దింపాలని నిర్ణయించుకుంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. మైదానంలో ధోనీ వ్యూహాలు, వికెట్ల వెనుక ఆయన ఇచ్చే సలహాలు లేకపోవడం వల్ల బౌలింగ్, ఫీల్డింగ్ లో పట్టు తప్పుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యువ ఆటగాడు దేవాల్డ్ బ్రెవిస్ కూడా గాయంతో ఉండటం జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.

