ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించే దిశగా ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి భారీగా టోల్ ఫీజు వసూలు చేయాలని ఇరాన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇరాన్ పార్లమెంటులో ప్రతిపాదించిన కొత్త నిబంధనల ప్రకారం.. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి చమురు ట్యాంకర్ నుండి టోల్ ఫీజు వసూలు చేయనున్నారు.
Also Read : పాకిస్తాన్ ను కామెడి పీస్ చేసిన ఇరాన్..!
నౌకలో ఉన్న ప్రతి ముడి చమురు బ్యారెల్‌కు ఒక అమెరికన్ డాలర్ చొప్పున టోల్ చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ టోల్ వసూలు ప్రక్రియలో ఇరాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి మరియు ఆర్థిక లావాదేవీలను గోప్యంగా ఉంచడానికి, ఈ టోల్ ఫీజును కేవలం క్రిప్టో కరెన్సీ రూపంలోనే స్వీకరించాలని యోచిస్తోంది.
Also Read : డయాబెటిస్ రోగులకు ఊరట.. అమెరికా మార్కెట్లోకి జైడస్ కొత్త షుగర్ మందు..!
బిట్‌కాయిన్ లేదా ఇతర డిజిటల్ కరెన్సీల ద్వారా చెల్లింపులు జరపడం వల్ల గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా నిధులను సమకూర్చుకోవచ్చని ఇరాన్ భావిస్తోంది. టోల్ వసూలుతో పాటు, జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌకను నిశితంగా పరిశీలించాలని ఇరాన్ నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా మరియు నిబంధనల అమలును పర్యవేక్షించడానికి నౌకలను ఆపి తనిఖీ చేసే అధికారం తమకు ఉంటుందని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 నుంచి 30 శాతం ఈ హార్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. ఇరాన్ తీసుకోబోయే ఈ నిర్ణయం అమలైతే, ప్రపంచ ఇంధన మార్కెట్లో భారీ కుదుపులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు చమురు రవాణా ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. అనధికారికంగా ఇప్పటికే.. ఇరాన్ టోల్ వసూలు చేస్తోంది.

