భారత పరిపాలనా వ్యవస్థలో మరోసారి అవార్డుల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు సంబంధించిన ఒక వివాదాస్పద అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ వ్యవహారాన్ని ప్రముఖ జర్నలిస్ట్ కొరీనా సువారెజ్ బయటపెట్టారు. సోషల్ మీడియాలో వేదికగా కొరినా చేసిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏమిటా వివాదం..? ఐఏఎస్ అధికారుల పనితీరు పైనే అనుమానం ఎందుకు వచ్చింది..? నిజానికి ఏ ప్రభుత్వంలో అయినా సరే.. ఒక పని పూర్తి చేస్తే.. దానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేయాలి. అలా చేసిన తర్వాత ఆ పనులు నిజంగానే చేశారా లేదా.. అని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే సంబంధిత శాఖ మంత్రిత్వ శాఖ అందుకు సంబంధించిన నిధులను విడుదల చేస్తుంది. అలాగే ఆ పనుల నాణ్యత ఆధారంగా ఆ అధికారులకు అవార్డులు, రివార్డులు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఓ ఐఏఎస్ అధికారి చేసిన పని భారత పరిపాలనా వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తోంది.
Also Read : దుమ్ము రేపిన జేసీ.. వామ్మో..!
తాజాగా కెరీనా సూరేస్ చేసిన ఆరోపణల్లో ఒక ఐఏఎస్ అధికారి తన వివాహ ఆహ్వాన పత్రికను ప్రభుత్వ ప్రాజెక్టుకు సంబంధించిన పని సాక్ష్యంగా ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. మరో అడుగు ముందుకు వేసిన మరో ఐఏఎస్ అధికారి.. ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలను ప్రభుత్వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సాక్ష్యాలుగా చూపించారట. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఇద్దరు అధికారులు కూడా భారత రాష్ట్రపతి నుంచి నగదు అవార్డులు పొందారనేది కేరీనా చేసిన ఆరోపణ.
నిజానికి ఇది వ్యవస్థలో ఉన్న అవినీతికి అద్దం పడుతుందనే మాట వినిపిస్తుంది. ఒక చిన్న పొరపాటు అయితే కాదు. టైపింగ్ మిస్టేక్ అంతకన్నా కాదు. ఇది జూనియర్ క్లర్క్ చేసిన తప్పు కూడా కాదు. పెళ్లి పిలుపే ప్రభుత్వ పనికి సాక్ష్యమైతే.. అంతకు మించిన అవినీతి ఎక్కడా ఉండదు కూడా. ఒక ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పూర్తైన ప్రాజెక్ట్‌కు సాక్ష్యంగా ఒక పెళ్లి ఆహ్వాన పత్రం అప్‌లోడ్ అయిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఐఏఎస్ అధికారి రియా దాది బృందం చేసిన అవినీతి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈమె సీనియర్ ఐఏఎస్ అధికారి టీనా దాది సోదరి కూడా. వివాహ ఆహ్వాన పత్రాన్ని జల్ శక్తి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో “పని పూర్తయినట్లు” చూపించే ప్రాజెక్ట్ సాక్ష్యంగా అప్‌లోడ్ చేశారనేది ప్రధాన ఆరోపణ.
Also Read : బీసీ నేతకు షాక్ ఇచ్చింది బీసీ ఓటర్లే నా!!
గ్రౌండ్ లెవెల్‌లో ఎక్కడా తట్ట మట్టి పని జరగలేదని.. జియో-ట్యాగ్ చేసిన ఫొటోలు లేవని.. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ జరగలేదని.. అయినా రికార్డుల్లో మాత్రం “ప్రాజెక్ట్ పూర్తయింది” అని నమోదు చేశారనే ఆరోపణలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వంద కోట్ల విలువైన ప్రభుత్వ అవార్డు, నగదు బహుమతి కూడా లభించిందనే ప్రచారం కూడా ఇప్పుడు దుమారం రేపుతోంది.
నిజానికి ఒక పెళ్లి కార్డు ప్రభుత్వ ప్రాజెక్ట్‌గా మారగలిగితే… భవిష్యత్తులో సెల్ఫీలు, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, ఫోటోషాప్ చిత్రాలు కూడా “అభివృద్ధి పనుల” సాక్ష్యాలైపోతాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ప్రభుత్వ పనికి సంబంధించిన అప్‌లోడ్ డాక్యుమెంట్‌ను ఎవరు పరిశీలించారు.. ఎవరు ఆమోదించారు.. ఆ ఫైల్ మీద ఎవరి సంతకం ఉంది.. అనే విషయం వెలుగులోకి రావాల్సి ఉంది. ఇది గవర్నెన్స్ కాదు.. ఫైళ్లలో నడిచే నాటకం.. పేపర్ మీద మాత్రమే ఉన్న అభివృద్ధి ఇది. నిజానికి ఈ ఆరోపణలు అవాస్తవమైతే.. వీటిని ప్రభుత్వం వెంటనే ఖండించాలి. కానీ ఇప్పటి వరకు అలా చేయలేదు. మరి ఆధారాలు ప్రజలు ముందు పెట్టాలి.. అలా కూడా చేయలేదు. ఈ ఆరోపణల్లో నిజం ఉంటే.. ఐఏఎస్ అధికారులకు ఇచ్చిన అవార్డులను వెంటనే రద్దు చేయాలి. బాధ్యులపై క్రిమినల్ విచారణ జరగాలి.. మొత్తం అవార్డు వ్యవస్థపై స్వతంత్ర ఆడిట్ జరగాలి.. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ పెద్దలు కనీస చర్యలు చేపట్టలేదు.
Also Read : బ్రేకింగ్: గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్..!
కేరీనా తన సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ముగింపు మరో స్కామ్‌తోనే.. అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలు నిజమైతే.. ఇది కేవలం వ్యక్తిగత తప్పిదం కాదు.. ఇది వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తుంది కూడా. అలాగే అవార్టుల వ్యవస్థ వైఫల్యానికి కూడా ఇది ఓ ఉదాహరణ. అవార్డుల వ్యవస్థపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి కూడా. ప్రాజెక్ట్ సాక్ష్యాలను ఎవరు పరిశీలిస్తున్నారు?.. ప్రభుత్వం ఉపయోగించే పోర్టల్స్‌లో వెరిఫికేషన్ వ్యవస్థ లేదా? అలాగే AI జనరేటెడ్ కంటెంట్‌ను గుర్తించే కనీస సాంకేతిక పరిశీలన కూడా లేదా?అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై కోరీనా సువారెజ్ చేసిన వ్యాఖ్యలు పరిపాలనా వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. నిజానికి ఇది కేవలం సోషల్ మీడియా విమర్శ మాత్రమే కాదు. ఇది లోతైన సమస్య కూడా అనేది నిపుణుల అభిప్రాయం. ఇటీవలి కాలంలో అవార్డుల కోసం ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఒక ఫార్మాలిటీగా మారిందనేది నిపుణుల ఆరోపణ. గ్రౌండ్ లెవెల్ పనికన్నా పేపర్ వర్క్, ఫోటోలు, ప్రెజెంటేషన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక AI టెక్నాలజీ రావడంతో నకిలీ విజువల్ సాక్ష్యాలు తయారు చేయడం మరింత సులభంగా తయారైందని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ కలిసే ఇలాంటి వివాదాలకు కారణమవుతున్నాయనేది విశ్లేషకుల మాట.
Also Read : చంద్రబాబు నాయుడు – గ్రీన్‌ఫీల్డ్ ఆర్కిటెక్ట్
మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటీ.. ప్రభుత్వాలు ఏం చేయాలి..? అనేది ప్రధాన ప్రశ్న. ఈ ఆరోపణలపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలి. అలాగే సంబంధిత అవార్డుల రీ – వెరిఫికేషన్ చేయాలి. ప్రభుత్వ పోర్టల్స్‌లో AI-డిటెక్షన్‌తో పాటు మానవ పరిశీలన కూడా ఉండేలా చర్యలు చేపట్టాలి. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా.. భవిష్యత్తులో గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలివ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైనే ఉంది.
నిజానికి అవార్డులు అనేది పరిపాలనా సేవల్లో ప్రోత్సాహకంగా ఉంటాయి. కానీ ఇప్పుడు వాటి కేటాయింపు కూడా ప్రశ్నార్థకంగా మారింది. పెళ్లి కార్డులు, AI ఫొటోలు ప్రభుత్వ ప్రాజెక్ట్ సాక్ష్యాలుగా మారితే.. అది కేవలం స్కామ్ కాదు, వ్యవస్థపై ప్రజల నమ్మకానికి తగిలే పెద్ద దెబ్బ కూడా. ఈ ఆరోపణలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

