రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ముగిసాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణ, ఖమ్మం జిల్లాలో అత్యంత ఘనంగా ఈ సంబరాలు జరిగాయి. గోదావరి జిల్లాలలో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఉండి ప్రాంతాల్లో కోడిపందాలతో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో.. రోడ్లు కిక్కిరిసిపోయాయి. హోటల్ రూమ్ లు దొరకక చాలామంది ఇబ్బందులు పడ్డారని చెప్పాలి. గోదావరి జిల్లాలకు సంబంధించి వెంప కాశీ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఏర్పాటు చేసిన కోడిపందాల బరులకు భారీ స్పందన వచ్చింది.
Also Read : కూటమిలో పెద్దల సభ పంచాయితీ..!
అయితే ఈ సందడితో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరినట్లు పరిశీలకులు చెప్తున్నారు. మద్యం, హోటల్స్, ఆహారం, పెట్రోల్ ఇలా భారీ ఎత్తున ఖర్చు చేయడంతో.. ప్రభుత్వానికి దాదాపుగా ఈ మూడు రోజుల్లో 600 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరినట్లు అంచనా వేస్తున్నారు. అటు బరుల వద్ద చిరు వ్యాపారం భారీగానే సంపాదించుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక కోడిపందాలు గానీ పేకాట గానీ మూడు రోజుల్లో దాదాపు 1500 నుంచి 1800 కోట్ల రూపాయలు వరకు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు వదిలేయడంతో.. పందెం రాయుళ్లు రెచ్చిపోయారు.
Also Read : హమ్మయ్య.. ఆలస్యంగానైనా కళ్లు తెరిచారు..!
ఎక్కువగా 5 లక్షల నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు పందాలు వేశారు. తాడేపల్లిగూడెంలో రాజమండ్రి కి చెందిన వ్యక్తి కోటిన్నర పందెం గెలిచారు. రఘురామకృష్ణంరాజు ఏర్పాటు చేసిన బరిలో దాదాపుగా 80 లక్షలు వరకు పందెం కాశారు. శుక్రవారంతో పండుగ పూర్తి కావడం లాంగ్ వీకెండ్ ఉండటంతో.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గోదావరి జిల్లాలోనే ఉండిపోయారు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి కృష్ణాజిల్లాలో సైతం భారీగా పందాలు కాశారు. ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణలో జరగటంతో పోలీసులు కూడా పెద్దగా దృష్టి సారించలేదు. గతేడాది కంటే ఈ ఏడాది భారీగా కోడిపందాలను నిర్వహించారు.

