వన్య ప్రాణుల భద్రత విషయంలో ప్రభుత్వాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కొందరి తీరులో మాత్రం మార్పు రాకపోవడం భయపెడుతోన్న అంశం. తాజాగా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి పరిసరాల్లోని శేషాచలం అడవులలో జరుగుతోన్న కొన్ని కార్యాకలాపాలతో రాష్ట్రం ఉలిక్కిపడింది. గత కొంతకాలంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు కేంద్రంగా ఉన్న ఈ అడవుల్లో, ఇప్పుడు వన్యప్రాణుల వేటగాళ్ల కదలికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చిన్న రామాపురం ప్రాంతంలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టవ్వడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
Also Read : బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్ రెడ్డి.. అసలేం జరుగుతోంది..?
గత వారం చిన్న రామాపురం పరిధిలో అటవీ శాఖ అధికారులు, పోలీసులు జరిపిన సంయుక్త తనిఖీల్లో ఏనుగు దంతాలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన అధికారులు, నిందితుల నుంచి భారీ పరిమాణంలో ఉన్న ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శివకుమార్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read : ట్రంప్ భయానికి కారణం ఇరాన్ షాక్ ట్రీట్‌మెంటేనా..?
నిందితుడి వద్ద నుంచి దంతాలతో పాటు, వేట కోసం ఉపయోగిస్తున్న రెండు నాటు తుపాకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన శివకుమార్ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ స్మగ్లింగ్ వెనుక పెద్ద నెట్ వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దంతాల అమ్మకాలు, కొనుగోలుదారులతో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో అతనే కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అధికంగా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఏనుగులను లక్ష్యంగా చేసుకుని దంతాల కోసం వేటాడటం అనేది అత్యంత ప్రమాదకరమైన పరిణామమని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న దంతాలను ఎక్కడికి తరలిస్తున్నారు..? దీని వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాల హస్తం ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసారు.

