ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. సీమెన్స్ కంపెనీకి చెందిన 23 కోట్ల స్థిర, చరాస్తుల్ని అటాచ్ చేసింది ఈడీ. ఢిల్లీ, ముంబై, పుణె నగరాల్లో ఉన్న సీమెన్స్ కంపెనీ ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఏపీఎస్ఎస్డీసీకి చెందిన సీమెన్స్ ప్రాజెక్టులో మనీలాండరింగ్ కు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా.. దర్యాప్తు చేస్తున్న ఈడీ… ఈ మేరకు చర్యలకు దిగింది.
2014-19 టీడీపీ హయాంలో రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం జరిగిందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేసు నమోదు చేయగా దానిపై విచారణ జరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లీన్ చిట్ ఇచ్చింది. చంద్రబాబు పాత్ర ఉందని గత ఏడాది చంద్రబాబును అదుపులోకి తీసుకుని పోలీసులు పలు ఆరోపణలు చేయగా ఇప్పుడు ఈడీ క్లీన్ చిట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : బాబుకు గ్యాప్ ఇవ్వని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ మరియు స్టార్ట్ అప్ లను ప్రోత్సహించేందుకు స్కిల్ డెవెలప్మెంట్ ప్రాజెక్ట్ ను సీమెన్స్ కంపెనీకి అప్పగించింది అప్పటి ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈడీ దర్యాప్తులో చంద్రబాబుకు కేసులో కీలకమైన నిధుల మళ్లింపుకు మధ్య ఎలాంటి సంబంధం లేదని తేలింది. నిధుల దుర్వినియోగంపై దర్యాప్తులో భాగంగా 2002 మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకుంది ఈడీ. అయితే చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినా టీడీపీ సోషల్ మీడియా గాని, నాయకులు గాని పెద్దగా ఎక్కడా రియాక్ట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

