భారత ప్రధాని నరేంద్ర మోదీ తనపై సంతోషంగా లేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల అమెరికా విధిస్తున్న సుంకాలను పరోక్షంగా ప్రస్తావించిన ట్రంప్.. అమెరికాలో తయారైన అపాచీ హెలికాప్టర్లను త్వరగా డెలివరీ చేయాలని మోదీ కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం ఆర్డర్ చేసిన హెలికాఫ్టర్‌లను వేగంగా డెలివరీ చేయాలని అమెరికాపైన భారత్ ఒత్తిడి చేస్తోందని ట్రంప్ గుర్తు చేశారు. సైనిక హార్డ్‌వేర్ అందజేతలో జాప్యంపై భారత్ గుర్రుగా ఉందన్నారు ట్రంప్. రక్షణ తయారీ వ్యవస్థ, విదేశీ సైనిక అమ్మకాల ప్రస్తావనలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తన దగ్గరకి వస్తుందని ఐదేళ్ల పాటు వేచి చూసినట్లు వ్యాఖ్యానించిన ట్రంప్.. భారత్‌ను మారుస్తున్నామంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read : రవితేజ – శర్వానంద్ కెరీర్‌ను డిసైడ్ చేయబోతున్న సంక్రాంతి
అమెరికా హెలికాప్టర్ల కోసం న్యూఢిల్లీ పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చిందని, ఈ విషయాన్ని భారత ప్రధాని నేరుగా తనతోనే లేవనెత్తారని ట్రంప్ అన్నారు. భారత్ 68 అపాచీలను ఆర్డర్ చేసిందని గుర్తు చేసిన ట్రంప్.. ప్రధాని మోడీ తనని కలవటం కోసమే అమెరికా వచ్చినట్లు వ్యాఖ్యానించారు. మోదీతో తనకు చాలా మంచి సంబంధం ఉందన్నారు. తన వ్యాఖ్యలలో, వాణిజ్య విధానంతో ముడిపడి ఉన్న సంబంధంలో ఒత్తిడి ఉందని ట్రంప్ అంగీకరించారు. మోడీ తనతో అంత సంతోషంగా లేరని.. ఎందుకనే విషయం అందరకీ తెలుసన్నారు. భారత్ ఇప్పుడు చాలా సుంకాలు చెల్లిస్తోందని తన పరిపాలనలో విధించిన సుంకాలను ప్రస్తావిస్తూ అన్నారు. భారతదేశం నుండి దిగుమతులపై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు.
సుంకాల మోతను కేంద్ర ఆర్థిక, జాతీయ భద్రతా సాధనంగా ఉపయోగించడాన్ని ట్రంప్ గట్టిగా సమర్థించుకున్నారు. సుంకాలు అమెరికాకు భారీ ఆదాయాన్ని ఆర్జించాయని.. వాణిజ్య భాగస్వాములు రాయితీలు ఇవ్వాల్సి వచ్చిందన్నారు ట్రంప్. భారతదేశం అపాచీ హెలికాప్టర్ ఆర్డర్‌ను అమెరికా రక్షణ ఉత్పత్తిలో జాప్యం గురించి విస్తృత ఆందోళనలతో ముడిపెట్టారు ట్రంప్. ఆయుధ వ్యవస్థలు అమెరికన్ దళాలను, విదేశీ కొనుగోలుదారులను చేరుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నాయని ట్రంప్ తన తోటీ చట్టసభ సభ్యులకు చెప్పారు. F-35లు, అపాచీ హెలికాప్టర్‌లను పొందడానికి చాలా సమయం పడుతుందని.. రక్షణ కాంట్రాక్టర్లు ఉత్పత్తిని వేగవంతం చేయాలనే ఆదేశించారు. మిత్రదేశాలు, భాగస్వాములతో సహా ఇతర దేశాలకు పరికరాలను వేగంగా అందించాలని తన పరిపాలన అమెరికా రక్షణ కంపెనీలపై ఒత్తిడి తెస్తోందని రిపబ్లికన్ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : చంద్రబాబు కష్టాన్ని గుర్తించడంలో క్యాడర్ విఫలమైందా?
దేశీయ రాజకీయాలు, వాణిజ్యం, సుంకాలు, జాతీయ భద్రతపై దృష్టి సారించిన ట్రంప్.. భారత్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రక్షణ సంబంధాలు, వాణిజ్య చర్యల వల్ల కలిగే ఇబ్బందులను ట్రంప్ పరోక్షంగా గుర్తు చేశారు. గత దశాబ్దంలో భారతదేశం US రక్షణ పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేసే దేశాలలో ఒకటిగా ఉంది. వాషింగ్టన్‌తో క్రమంగా విస్తరిస్తున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా రవాణా విమానాలు, హెలికాప్టర్లు, నిఘా వేదికలను కొనుగోలు చేసింది. అపాచీ హెలికాప్టర్లు భారతదేశ సైన్యం, వైమానిక దళ ఆధునీకరణ ప్రణాళికలలో కీలకమైన భాగం.

