అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ల.. కాదేది కవితకు అనర్హం అన్నారు మహా కవి శ్రీ శ్రీ. ఈ మాట కవుల కంటే కూడా రాజకీయ నాయకులకు సరిగ్గా సరిపోతుంది. అధికారం కోసం ఒకలా, అధికారంలో ఉంటే మరోలా వ్యవహరించడం రాజకీయ నాయకులకు సర్వ సాధారణం. ఎన్నికల సమయంలో అయితే రాజకీయ నాయకుల జిమ్మిక్కులు మామూలుగా ఉండవు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు. ఒకరు దోశలు పోస్తే.. మరొకరు సైకిల్ తొక్కుతారు.. ఇంకొకరు క్రికెట్ ఆడుతారు.. ఇలా నియోజకవర్గాల స్థాయి నేతలు ఓట్ల కోసం పాట్లు పడతారు. మరి రాష్ట్ర స్థాయిలో అయితే.. జాతీయ స్థాయిలో అయితే..!
Also Read : ఆ విషయంలో ఇద్దరు సీఎంలు ఒకటే..!
ఎన్నికల ముందు ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తాయి. ఇప్పుడు రాష్ట్రస్థాయిలో అయితే ఉచిత పధకాల అమలుతో పాటు నగదు బదిలీ కూడా ప్రధాన హామీగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. ఇక కేంద్ర స్థాయిలో అయితే.. చాలా తాయిలాలు ప్రకటిస్తారు. అయితే జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు అయితే.. రాష్ట్రాల్లో పోటీ చేసే సమయంలో.. వ్యవహరించే తీరు మరీ విడ్డూరంగా ఉంటుంది.
ఓటర్లకు ఆకట్టుకోవాలంటే.. ఆయా రాష్ట్రాలకు నిధుల కేటాయింపు, రైల్వే ప్రాజెక్టులు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. తాజాగా కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మోదీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ సర్కార్.. దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. కానీ అలా జరగటం లేదనే మాట బాగా వినిపిస్తోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కూడా.
Also Read : పొలిటికల్ బ్యాక్ డ్రాప్.. బాలయ్య కోసం మలినేని ప్లాన్..!
మరో నాలుగు నెలల్లో దేశంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే కేరళలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ అవి ఫలించటం లేదు. తమిళనాడు, కేరళలో అయితే బీజేపీ పరిస్థితి అత్యంత దారుణం. కేరళలో కనీసం డిపాజిట్లు కూడా రావటం లేదు. అందుకే కేరళ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే సురేష్ గోపీ వంటి స్టార్ నటుడిని కేంద్ర మంత్రిని చేసిన మోదీ సర్కార్.. ఆయన అభిమానుల ఓట్లపై కన్నేసింది. ఇప్పుడు కూడా అలాంటి ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది.
తాజాగా పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. అందులో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. పద్మ పురస్కారాలను లోతుగా పరిశీలిస్తే.. అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ను ఐదుగురికి ప్రకటించారు. అందులో ముగ్గురు కేరళకు చెందిన వారే ఉన్నారు. ఇక పద్మ భూషణ్ అవార్డులను 13 మందికి ప్రకిటిస్తే.. ఆ జాబితాలో కేరళ నుంచి ఇద్దరికీ, తమిళనాడు నుంచి ఇద్దరికీ అవార్డులు దక్కాయి. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక్కరు కూడా లేరు.
Also Read : రాజధాని అమరావతిలో అట్టహాసం: ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఆత్మవిశ్వాసం
ఇక పద్మ శ్రీ పురస్కారాల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌కే ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. 131 మందికి పద్మ శ్రీ పురస్కారం దక్కితే.. అందులో తెలుగు రాష్ట్రాల వాళ్లు 11 మంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఏడుగురికి పద్మ శ్రీ పురస్కారం దక్కింది. అదే సమయంలో తమిళనాడు నుంచే 11 మందిని పద్మ శ్రీ కి ఎంపిక చేయగా.. పశ్చిమ బెంగాల్ నుంచి పది మందిని ప్రకటించారు. ఈ వివక్ష ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్ల కేటాయింపులో కూడా కేంద్రం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయా నటులు, కళాకారుల అభిమానులను సంతృప్తి పరిచేందుకు ఇలా అవార్డులు ఇవ్వటం సరికాదనే మాట బాగా వినిపిస్తోంది.

