కల్తీ నెయ్యి వ్యవహారం, తిరుమల లడ్డూ పవిత్రత, భక్తుల మనోభావాలపై జరిగిన అపచారాలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. తాను వెంకటేశ్వరస్వామి భక్తుడినని, స్వామి తమ ఇంటి కులదైవమని పేర్కొంటూ ఈ అంశం రాజకీయమేగాక భక్తుల విశ్వాసానికి సంబంధించినదని స్పష్టం చేశారు. చిన్ననాటి నుంచి ప్రతి శనివారం ఉపవాసం ఉండి మొక్కులు చెల్లించుకున్నామని, అలిపిరి బ్లాస్ట్ ఘటనలో తనను కాపాడింది స్వయంగా వెంకటేశ్వరస్వామేనని చంద్రబాబు భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. సాధారణంగా అయితే బతికే అవకాశం లేదని, స్వామి కరుణతోనే జీవించానని తెలిపారు.
Also Read : మల్లన్న దగ్గర కూడా కల్తీ పాపాలేనా..?
గడిచిన ఐదేళ్లలో తిరుమలతో పాటు అనేక దేవాలయాల్లో అపచారాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. రాముడి విగ్రహ శిరచ్ఛేదనం, అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనలు, ఆంజనేయుడి విగ్రహ అవమానాలపై ప్రశ్నలు అడిగిన వారిపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. దేవుడంటే లెక్కలేని నిర్లక్ష్య ధోరణి పాలకుల్లో కనిపించిందని, బ్రిటిష్ పాలకులు కూడా వెంకటేశ్వరస్వామి జోలికి రాలేదని వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా వినలేదన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించడమంటే మహాపాపమని చంద్రబాబు స్పష్టంగా అన్నారు. తిరుమల లడ్డూ రుచి, వాసన ప్రపంచంలో ఎక్కడా దొరకదని, దాన్ని డూప్లికేట్ చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని గుర్తు చేశారు.
Also Read : బాబు-పవన్ భేటీ.. ఆ విషయంపై క్లారిటీ..!
గడిచిన ఐదేళ్లలో లడ్డూ పవిత్రతను దెబ్బతీశారని ఆరోపిస్తూ, సీబీఐ ఎక్కడా కల్తీ జరగలేదని చెప్పలేదని తెలిపారు. అయినా క్లీన్ చిట్ వచ్చిందని చెబుతున్నవారు నెయ్యి కల్తీ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, దోషులు అన్ని విధాలా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని సీఎం తేల్చిచెప్పారు. వన్‌మెన్ కమిటీ అధ్యయనం తర్వాత కఠిన నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై నింద మోపినట్లే, తిరుమల లడ్డూ వ్యవహారంలోనూ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దౌర్జన్యం, రౌడీయిజం చేస్తామంటే సహించబోమని హెచ్చరించారు.
Also Read : బాబాయ్ కోసం వెనక్కి తగ్గిన అబ్బాయ్..!
ముందు మాధవ సేవ, ఆ తర్వాతే మానవ సేవ అన్నదే తమ సిద్ధాంతమని చంద్రబాబు చెప్పారు. దేవుడి పవిత్రతను కాపాడలేని అసమర్థులం కాదని స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామిపై నిజమైన నమ్మకం ఉంటే అబ్దుల్ కలాం చేసినట్లే డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని వ్యాఖ్యానిస్తూ, ఈ విషయంలో బాధ్యులు తప్పు చేసినందుకు బాధ్యత తీసుకోవాలన్నారు. దేవుని సొమ్ము దొంగతనం జరిగితే సెటిల్‌మెంట్ చేస్తారా? అనే ప్రశ్నతో తన వాదనను మరింత బలపరిచారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ అడగకుండా తిరిగి మాపైనే దాడి చేస్తున్నారని, భగవంతుడితో పెట్టుకుంటే సర్వనాశనమవుతారు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

