అమరావతి ప్రాంత అభివృద్ధి విషయంలో దూకుడుగా ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. రైతుల సమస్యల పరిష్కారం పై దృష్టి సారించారు. గత కొన్నాళ్ళుగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వరుసగా రైతలతో చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అమరావతి రైతుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం జోన్లు ఏర్పాటు చేస్తాం.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read : ఫోన్ కోసం కక్కుర్తి.. కల్తీ నెయ్యిలో సంచలన విషయాలు
రాజధాని రైతులంతా ఇక ఒకే గొడుగు కిందకు రావాలని, రైతులంతా అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కిందకు రావాలని సూచించారు. రాజధాని రైతులంతా జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు గురించి కేంద్ర ఆర్థికమంత్రికి వివరించామన్న ఆయన.. రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులడిగితే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపారు. భూ త్యాగాలు చేసిన రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
Also Read : బాబు గారు.. ఆ మాట మర్చిపోయారా..!
రాష్ట్రంలో అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టిపెట్టామని పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ ఉందని, నాతో సమావేశం తర్వాత రైతులకు అన్నింటిపైనా స్పష్టత వచ్చిందన్నారు. రాజధాని రైతులు కూడా ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. రెండో దశ భూసమీకరణ ఉపయోగాలను రైతులకు వివరించానని.. అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోకూడదన్నారు. అమరావతి మహానగరంగా మారితే వచ్చే ఫలితాలు రైతులు అర్థం చేసుకున్నారని , త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతుంది.. రాజధాని అభివృద్ధి ఇక అనస్టాపబుల్ అని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తిచేసే దిశగా కృషిచేస్తున్నామని ప్రకటించారు.

