వరద సహాయ చర్యలపై మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యంపై సమావేశంలో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. బుడమేరు ముంపు ప్రాంతంలో డ్యూటీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా పంపిణీలో జాప్యం జరుగుతుందని ఒక మంత్రి చంద్రబాబుకు వివరించారు. జగన్ భక్త అధికారులుగా ముద్రపడి, నాడు వైసిపీ కి అంటకాగిన అధికారులు డ్యూటీలో ఉన్న చోట సమస్య తీవ్రంగా ఉందని సదరు మంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు.
పంపిణీ సక్రమంగా, వేగంగా జరగకుండా ఉద్దేశపూర్వకంగా ఆయా అధికారులు వ్యవహరిస్తున్న విషయం గుర్తించామన్నారు. క్షేత్ర స్థాయి పర్యటనలో స్వయంగా తన పరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకుని వచ్చి మరీ సిఎంకు ఇచ్చారు. విఆర్ లో ఉండి వరద బాధిత ప్రాంతాల్లో డ్యూటీకి డిఎస్పీ నుంచి డిఐజీ స్థాయి అధికారులు వచ్చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశ్యంతో ఆయా అధికారులు సహాయ చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, పని చేస్తున్న అధికారులకి ఆటంకాలు కల్పిస్తున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
వివిధ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం విఆర్ లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి, విజయారావు, రఘువీరా రెడ్డి, శ్రీకాంత్, సత్యానంద్, గోపాలకృష్ణ వంటి అధికారులకు అక్కడ విధులు కేటాయించామని చెప్పగా.. మంత్రి చెప్పిన సమాచారాన్ని తీవ్రంగా తీసుకున్న సిఎం.. ఆయా అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో పంపిణీకి ఆలస్యంపై నివేదిక ఇవ్వాలని మంత్రిని ఆదేశించారు. విఆర్ లో ఉన్న ఆ అధికారులకు బందోబస్తులో భాగంగా అక్కడ డ్యూటీలు వేశామని అధికారులు వివరించారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని.. ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని హెచ్చరించారు. ఆహార పంపిణీలో మరింత సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.