హైదరాబాద్ మహానగరంలో జూన్ 29 నుంచి జూలై 21 వరకు బోనాల జాతర సంబరాలు ప్రారంభం కానున్నాయి. పేద, మధ్య తరగతితో పాటు మిగతా వారు కూడ భోనాల పండుగ జరుపుకుంటారు. బోనాల జాతర అంటే అమ్మవారికి బోనాలు, మేక, గొర్రె పోతులతో మొక్కులు, మద్యంతో శాక పోయడం పరిపాటి. జాతర సందర్భంగా ఇంటిల్లిపాది బంధువులను పిలుచుకొని సంబరాలు జరుపుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే.. మినీ దసరా రీతిలో జరిగే బోనాల జాతరలో మద్యం వినియోగం జోరుగా ఉంటుంది. జూన్, జూలై నెల్లో 10 రోజుల పాటు బోనాల జాతరలు జరుగుతాయి. ఈ సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతాయని, వ్యాపారులు అవసరమైన స్టాకు సమకూర్చుకోవడానికి ఇప్పటికే సన్నాహాలు చేపట్టారు.
Also Read : తెలంగాణాలో షేక్ ఆడిస్తున్న ఏసీబీ.. ఆరు నెలల్లో ఎన్ని కేసులంటే..?
బోనాల జాతర సందర్భంగా జూలై నెలలో భారీగా అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. జాతర సందర్భంగా జరిగే మద్యo అమ్మకాల్లో కల్తీ మద్యం, ఫ్యూచరు లిక్కర్ వినియోగం, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగం జరిగే అవకాశాలు ఉంటాయని భావించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్… ఎస్‌టీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీఎఫ్ శాఖలను ఎన్‌డీపీఎల్ మద్యంపై అప్రమత్తం చేశారు. తెలంగాణలో ఆషాడమాసంలో జరిగే బోనాల జాతరలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జరుగుతాయనే తేదీలను ముందుగానే ఖరారు చేశారు. జూన్ 29న గోల్కండ, జూలై 2న బల్కంపేట్, 4న జూబ్లీహీల్స్, 10న ఉజ్జయిని మహాంకాళీ, 13,14 బోనాల జాతర, 15న చార్మినార్, 17న లాల్‌దర్వాజా, 20న పాతబస్తీ, 21న బోనాల ఘటాలతో ఊరేగింపుతో బోనాల జాతర హైదరాబాద్ మహానగరంలో పూర్తవుతాయి.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ ప్రాంతాల్లో బోనాల జాతర సందర్బంగా మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో 2024-25 సంవత్సరంలో బోనాలు జరిగే జూన్, జూలై, ఆగష్టు నెలల్లో మద్యం అమ్మకాలు పరిశీలిస్తే బోనాల జాతర సందర్భంగా మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు రికార్డులు చూపుతున్నాయి. 2024 – 25 జాన్ నెలలో 30.24 లక్షల పెట్టెల లిక్కర్, 39.94 లక్షల బీరు పెట్టెల అమ్మకాలు జరిగాయి. జూలైలో 31.80 లక్షల పెట్టెల లిక్కర్, 47.94 లక్షల పెట్టెల బీరు అమ్మకాలు జరిగాయి. ఆగస్టులో 30.86 లక్షల పెట్టెల లిక్కర్, 39.77 లక్షల పెట్టెల బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ మూడు నెలల రికార్డులను పరిశీలించినప్పుడు బోనాల జరిగిన జూలైలో లక్ష నుంచి లక్షన్నర పెట్టెల లిక్కర్, బీరు అమ్మకాలు అధికంగా జరిగాయి.
Also Read : సింగయ్య మృతి ప్రభుత్వ వైఫల్యమా లేక వైసీపీ నిర్లక్ష్యమా?
ఈసారి అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెలాఖరు వరకు పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేసుకోవడానికి వ్యాపారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. 2023లో 176 ఎన్‌డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులునమోదు అయ్యాయి. కానీ బోనాల జాతర జరిగిన జూలై నెలలో ఎన్‌డీపీఎల్ కింది 78 కేసులు నమోదు అయ్యాయి. 2023లో 2,940 లీటర్ల మద్యం సీజ్ చేస్తే.. ఒక్క జూలైలోనే 1,845 లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలపై 2023లో 133 కేసులు నమోదవుతే.. 2024లో 482 కేసులు నమోదు చేశారు. 2023లో 932 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. 2024లో 2937 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.
ఈ సారి జరిగే బోనాల జాతర సందర్భంగా ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ టీమ్‌లు మరింత నిఘా పెట్టి ఎన్‌డీపీఎల్, అనుమతులు లేని మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఎన్‌ఫొర్స్‌మెంట్, ఎక్సైజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఎన్‌డీపీఎల్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను పెద్ద మొత్తంలో పట్టుకున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ డైరెక్టర్ తెలిపారు. మరో వైపు డిఫెన్స్ లిక్కర్‌పై ప్రత్యేక ఫోకస్‌తో దాడులు నిర్వహిస్తున్నారు. బోనాల జాత సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ రాకుండా గట్టి నిఘా పెట్టినట్లు వెల్లడించారు. స్థానికంగా ఫ్యూరియస్ లిక్కర్‌ను అరికట్టడానికి చర్యలు చేపడుతామన్నారు. బోనాల జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

