“మన ఇంట్లో వెలిగితే దీపం.. పక్కింట్లో వెలిగితే చిచ్చు” ఇప్పుడు బిజెపి వ్యవహారశైలి ఇలాగే ఉంది. అవినీతి మరక అసలు తమకు అంటదు… తాము గంగలో మునిగి పరమ పవిత్రం అయ్యాం అనుకున్నారో ఏమో గాని ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులను జైలుకు పంపే కార్యక్రమం మొదలుపెట్టింది బిజెపి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పటికే జైలు జీవితాన్ని గడిపి బయటకు రాగా, మరో ముఖ్యమంత్రిని టార్గెట్ చేసింది బిజెపి. గవర్నర్ కేంద్రంగా రాష్ట్రాల్లో బిజెపి చేస్తున్న రాజకీయం ఇప్పుడు ముఖ్యమంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు శాపం అయింది.
లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ జైలుకి వెళ్ళారు. ఆయన జైలు నుంచి ఇటీవల బయటకు వచ్చారు. లిక్కర్ స్కాంలో ఆయనకు బెయిల్ రావడం కూడా కష్టం అయింది. ఢిల్లీలో పాగా వేయాలని భావించి కేంద్రం ఈ చర్యలకు దిగింది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కాని కేజ్రివాల్ పై క్రమంగా సానుభూతి పెరగడంతో కేంద్ర పెద్దలు వెనక్కు తగ్గినట్టే కనపడింది. ఇక ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విషయంలో కూడా జరిగింది ఇదే. అవినీతి ఆరోపణలతో ఆయనను జైలుకు పంపారు.
చివరకు ఆయనకు సానుభూతి పెరగడంతో తప్పక వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను టార్గెట్ చేసారు. గవర్నర్ విచారణకు ఆదేశాలు ఇవ్వడం ఆ తర్వాత కేసు నమోదు చేయడం, కోర్ట్ ఆదేశాలు రావడం ఇవన్నీ వేగంగా జరిగాయి. వాస్తవానికి ముడా భూములు కేటాయించింది బిజెపి ప్రభుత్వంలోనే. ఎప్పుడో 2005 లో జరిగిన సంఘటన అది. సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి.
Read Also : తెలంగాణాలో వైసీపీ సోషల్ మీడియా 2…
ఇప్పుడు సిద్దరామయ్య కూడా జైలుకి వెళ్ళే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఆయన భార్య ఇప్పటికే ఆ భూములు మేము ప్రభుత్వానికి ఇచ్చేస్తాం అని ప్రకటించారు. ఆయన బావ మరిది కూడా ఇదే మాట మాట్లాడారు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా జరగాల్సింది జరుగుతోంది. దక్షినాదిలో పట్టు కావాలంటే కర్ణాటక బిజెపికి మెయిన్ గేటు. అందుకే అక్కడ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదంతా బాగానే ఉంది గాని… మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, మధ్యప్రదేశ్, అసోం ముఖ్యమంత్రుల మీద ఆరోపణలు వచ్చాయి కదా… గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళని స్వామిపై కూడా వచ్చాయి కదా… మరి వీటిపై కేసులు ఎందుకు నమోదు కాలేదు, కనీసం దర్యాప్తు బృందాలు కూడా వాళ్ళ ఇళ్ళకు ఎందుకు వెళ్ళలేదు అనేది బిజెపి సమాధానం చెప్పాలనే డిమాండ్ లు వస్తున్నాయి.

