Wednesday, February 4, 2026 02:31 PM
Wednesday, February 4, 2026 02:31 PM

అమరావతికే కుచ్చు టోపీ పెడుతున్న బినామీ ఏజెన్సీలు..!

సీఆర్‌డీఏ.. ఈ నాలుగు అక్షరాలు అందరికీ పరిచయమే. కానీ చాలా మందికి దీని పూర్తి పేరు ఏమిటో తెలియదు. ఏం పని చేస్తుందో కూడా తెలియదు. దీని గురించి వినడమే తప్ప.. దీని వల్ల ఉపయోగం ఏమిటో ఎవరికీ తెలియదు. సీఆర్‌డీఏ.. అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ.. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ. అంటే ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులు పర్యవేక్షిస్తుందా.. అనేది చాలా మంది అనుమానం. అలాంటిది ఏం లేదు. అసలు అమరావతి నిర్మాణ పనులన్నీ కూడా మునిసిపల్ శాఖ పరిధిలోనే ఉంటాయి. అలాగే ఆయా శాఖలే నేరుగా వీటి నిర్మాణాలు చేపడుతాయి. అంతే తప్ప.. సీఆర్‌డీఏకు వీటిపై ఎలాంటి పెత్తనం లేదు కూడా. అయితే సీఆర్‌డీఏ పని మాత్రం.. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ ఫెస్ట్ జరిగినా సరే.. అమరావతి గురించి ప్రచారం చేసేందుకు సీఆర్‌డీఏ అధికారులు సిద్ధమవుతారు. అమరావతి బ్రాండింగ్ కోసం తెగ కష్టపడతారు అనే మాట కంటే కూడా.. ప్రభుత్వ సొమ్మును మంచినీళ్ల మాదిరిగా ఖర్చు చేస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు కూడా.

Also Read : తిరుమలలో మరో భారీ స్కామ్.. 50 కిలోల బంగారం మాయం!

నిజానికి విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నాయి. అయినా సరే.. ఏపీకి రాజధాని నిర్మాణం ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఆ బాధ్యతలను సీఆర్‌డీఏకు అప్పగించారు. 2014 డిసెంబర్‌లో సీఆర్‌డీఏ ఏర్పాటైంది. పుష్కర కాలం అవుతున్నా సరే.. ఇప్పటి వరకు ఈ ప్రాధికార సంస్థ వల్ల కాంట్రాక్టర్లు, రియల్టర్లకు తప్ప సామాన్యులకు జరిగిన మేలు ఏమిటీ అంటే.. సమాధానం లేదు అంటారు. రైతుల నుంచి భూ సమీకరణ, వారికి ప్లాట్ల కేటాయింపు, భూములు పొందిన సంస్థలు వాటిల్లో చేస్తున్న పనులపై కూడా సీఆర్‌డీఏ దృష్టి పెట్టాలి. కానీ వీటి కంటే కూడా అమరావతి బ్రాండ్ ఇమేజ్ పేరుతో సీఆర్‌డీఏ అనే సముద్రంలో కొందరు అవినీతి తిమింగలాల అవతారం ఎత్తారు. ప్రభుత్వంలో ఏ శాఖకైనా సరే.. నిధుల కొరత ఉందేమో కానీ.. సీఆర్‌డీఏకు మాత్రం ఆ పరిస్థితి లేదు. కావాల్సినంత మంజూరు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇదే కొందరు అధికారులకు వరంగా మారింది.

బ్రాండింగ్ పేరుతో రంగంలోకి దిగిన కొందరు అధికారులు.. బినామీ ఏజెన్సీలకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం కాంట్రాక్ట్ పద్ధతిలో డైరెక్టర్ స్థాయి పోస్టులను కూడా క్రియేట్ చేశారు. ఆంధ్రుల కలల రాజధాని నిర్మాణం పేరుతో మేము ప్రచారం చేస్తామని ఏజెన్సీలు ప్రభుత్వానికి హామీలు ఇస్తున్నాయి. ఆ తర్వాత కొందరు అధికారుల సాయంతో సీఆర్‌డీఏలోకి ప్రవేశిస్తున్నాయి. ఇక అప్పటి నుంచి వీటి పెత్తనం మొదలవుతుంది. అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ పేరుతో విదేశాల్లో పర్యటనలు మొదలుపెడుతున్నారు. నిజానికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణ సహా ఇతర ప్రభుత్వ పెద్దలు తరచూ అమరావతి గురించి అన్ని వేదికలపై చెబుతూనే ఉన్నారు. అమరావతిలో అవకాశాలపై ముఖ్యమంత్రి స్వయంగా ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై కూడా వివరించారు. కానీ.. దాని వల్ల ఏం లాభం లేదని.. బ్రాండింగ్ కోసం తాము చేసిందే పని అనేది బినామీ ఏజెన్సీల మాట. ఇందుకోసం కోట్ల రూపాయలను మంచినీళ్ల మాదిరిగా.. ఇంకా చెప్పాలంటే.. మంచినీళ్ల కోసం కూడా కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత కొందరు సీఆర్‌డీఏ అధికారులకు, వారి బినామీ ఏజెన్సీలకు దక్కుతుంది.

Also Read : వృద్ధురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్

సీఆర్‌డీఏలో నకిలీ ఏజెన్సీల సంఖ్య ఎక్కువగానే ఉంది. చాలా ఏజెన్సీలు అమరావతి కేంద్ర కార్యాలయంలో తిష్ఠ వేసి.. సంస్థ సొమ్మును దిగమింగుతున్నాయనేది బహిరంగ రహస్యం. బ్రాండింగ్ పేరుతో కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న హంగామా మామూలుగా ఉండదు కూడా. చేతిలో ఓ ల్యాప్‌టాప్ పట్టుకుని.. అటూ ఇటూ తిరుగుతూ.. కార్పొరేట్ సంస్థలో టెక్కీల మాదిరిగా బిల్డప్ ఇస్తున్నారనే విషయం.. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇట్టే అర్థమైపోతుంది. ఇక సీఆర్‌డీఏలో ఏపీ వారి కంటే కూడా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఎక్కువగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారనేది వాస్తవం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కనీస అవగాహన కూడా లేని వారితో ఏపీ, అమరావతి బ్రాండింగ్ ఎలా తీసుకువస్తారనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక హంగులతో నిర్మించిన సెంట్రల్ ఏసీ కార్యాలయంలో పలు ఏజెన్సీలు అమరావతి బ్రాండ్ ఇమేజ్ పేరుతో పని, పాట లేకుండా కాలక్షేపం చేస్తున్నాయనేది వాస్తవం. వీళ్లకు ఏటా కోట్ల రూపాయలను సీఆర్‌డీఏ చెల్లిస్తోంది.

ప్రస్తుతం సీఆర్‌డీఏలో ఉన్న పలు బోగస్, నో ప్రోగ్రెస్ ఏజెన్సీలకు కొందరు ఉన్నతాధికారులు అండగా ఉన్నారనేది వాస్తవం. ముడుపులు తీసుకుని.. బోగస్ సంస్థలకు వత్తాసు పలుకుతున్నారు. ఇక అమరావతి బ్రాండింగ్ కోసం సీఆర్‌డీఏ పరిధిలోని అమరావతిలో కొలువైన గౌతమ బుద్ధ “సిద్దార్డుడు” సంకలో పిల్లితో ప్రపంచమంతా తిరిగేస్తూ.. తెగ కష్టపడుతున్నాడనే తీరు అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రచారం కోసం సోషల్ మీడియాలో తెగ కష్టపడిన కొందరు.. అమరావతి కోసమే ఇప్పుడు తాము కష్టపడుతున్నట్లు కొందరి బినామీ ఏజెన్సీలకు “శ్రీకారం” చుడుతున్న తీరు అయితే.. న భూతో న భవిష్యత్. పేరు గొప్ప‌, ఊరు దిబ్బ అన్న‌ట్లు, ప‌లు బోగ‌స్, నో ప్రోగ్రెస్ ఏజెన్సీల‌ ముసుగులో సీఆర్‌డీఏ సొమ్మును విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేస్తున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా అమ‌రావ‌తి బ్రాండ్ ఇమేజ్ పెంచ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నారు.

Also Read : బీఆర్ఎస్ బాడీ లాంగ్వేజ్ మారిందా..?

ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి, విజ‌న‌రీ సీఎం చంద్ర‌బాబు నాయుడు 75 ఏళ్ల వ‌య‌సులో కూడా నిరంతరం శ్ర‌మిస్తున్నారు. కేంద్రం నుంచి నిధుల కోసం ఢిల్లీ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని కంపెనీలను ఒప్పించేందుకు నానా పాట్లు పడుతున్నారు. కానీ సీఆర్‌డీఏ కార్యాలయంలో మాత్రం ఏసీ గ‌దుల్లో కూర్చొని ప్ర‌యివేటు ఏజెన్సీలు త‌మ ప‌బ్బం గ‌డుపుకుంటున్నాయి. తీరా వీరు చేసే ప‌ని, సోష‌ల్ మీడియాలో అడ‌పా ద‌డ‌పా పోస్టింగులు, ప్రాజెక్టుల కోసం వ‌చ్చే పెట్టుబ‌డుదారులు, కాంట్రాక్ట‌ర్ల‌తో బాతాఖానీ మాత్రమే. అమ‌రావ‌తి నిర్మాణం అంతా త‌మ భుజ‌స్కందాల‌పై ఉన్న‌ట్లు ఫీలింగ్ ఇచ్చే, కొంద‌రు సీఆర్‌డీఏ ప్ర‌తినిధులు ఈ బ్రాండ్ ఇమేజ్ థీయ‌రీతో బాగుప‌డిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే.. బాగా వెనకేసుకుంటున్నారు కూడా. ఎక్క‌డి నుంచో వ‌చ్చి, ఇక్క‌డ చేరి, క‌మ్యూనికేష‌న్ వింగ్‌లో డైరెక్ష‌న్ పేరిట‌, ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు తామే తీసుకువస్తున్న‌ట్లు బిల్డ‌ప్ ఇస్తూ, ఉన్న‌తాధికారుల‌తో అంట కాగుతున్నారు. అమ‌రావ‌తి బ్రాండ్ ఇమేజ్ పెంచుతామ‌ని, ఈ అక్ర‌మార్కులు సాగిస్తున్న అవినితి దందా రాసుకుంటూ పోతే సీరియల్ అవుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్