Friday, April 10, 2026 03:53 AM
Friday, April 10, 2026 03:53 AM

టార్గెట్ ఒలింపిక్స్.. మరి వసతుల మాటేమిటీ..?

ఏపీకి క్రీడాంధ్రప్రదేశ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్న మాట. అందుకే రాజధాని అమరావతిలో నవ నగరాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు.. అందులో క్రీడల కోసమే ప్రత్యేకంగా ఒక నగరాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధానిలో పరిపాలన, ఆర్థిక, న్యాయ, వైద్య, పర్యాటక, మీడియా, ఎలక్ట్రానిక్, విజ్ఞాన, క్రీడల నగరాలు ఉంటాయన్నారు. క్రీడా నగరం వెయ్యి ఎకరాల్లో రెండు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుందని ప్రకటించారు. అలాగే క్రీడల్లో విశేష ప్రతిభ చూపించిన వారికి ప్రత్యేక నగదు బహుమతితో పాటు ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు.

ఏపీలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని.. క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు కూడా. అలాగే భారత్‌లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒలింపిక్స్ నిర్వహించే స్థాయిలో స్టేడియంలు నిర్మించాలని, క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో రావాలన్నారు కూడా. ఇందుకోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు కూడా. అలాగే మారుమూల ప్రాంతాల్లో కూడా క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అయితే సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదనేది వాస్తవం.

Also Read : బ్రేకింగ్ : రెడ్డప్పగారి మాధవి, బీటెక్ రవిపై లోకేష్ సీరియస్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో నేషనల్ గేమ్స్‌తో పాటు ఆఫ్రో – ఆసియన్ గేమ్స్‌ను గొప్పగా నిర్వహించారు. ఇందుకోసం హైదరాబాద్‌ గచ్చిబౌలిలో భారీ స్టేడియం నిర్మించారు. స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేశారు. స్పెషల్ టెన్నిస్ కోర్టు, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఆక్వాటిక్ స్టేడియం, సరూర్ నగర్, యూసుఫ్ గూడలో ఇండోర్ స్టేడియం నిర్మించారు. అలాగే బీసీసీఐతో మాట్లాడి.. ఉప్పల్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేశారు. ఇవి హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులు వెలుగులోకి వచ్చేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా క్రీడాంధ్రప్రదేశ్‌గా మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆ ప్రకటన కార్యరూపం దాల్చటం కష్టంగా ఉంది. మంగళగిరిలో బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఎప్పటికీ పూర్తి అవుతుందో తెలియదు. ఇక విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం అయితే.. పూర్తిగా రాజకీయ సమావేశాలకు వేదికగా మారిపోయింది. శాప్ ఆధ్వర్యంలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు సరైన వసతులు లేక.. కొన్ని సందర్భాల్లో కృష్ణా నదిలోని ఇసుకలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక విశాఖలో ఉన్న ఏసీఏ స్డేడియం మాత్రమే ఇప్పుడు మ్యాచ్‌ల నిర్వహణకు అనువుగా ఉంది. అంతే తప్ప.. తిరుపతి, కర్నూలు, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి నగరాల్లో సరైన మౌలిక వసతులు లేవనేది క్రీడాకారుల ఆరోపణ.

వాస్తవాని కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు 13 జిల్లా కేంద్రాల్లో స్డేడియంలు ఉన్నాయి. కానీ అవి అధ్వాన్న స్థితిలో ఉన్నాయనేది వాస్తవం. 2014-19 మధ్య యువజన, క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు.. శ్రీకాకుళంలోని ఆయన క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి కోసం రూ.4 కోట్లు కేటాయించారు. కానీ ఆ పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇండోర్ స్టేడియం అరకొర వసతులతో ఉంది. వీటితో పాటు రాజమండ్రి మునిసిపల్ స్డేడియం, కాకినాడ జేఎన్‌టీయూ ఇండోర్ స్టేడియం, ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం, గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం, నెల్లూరు ఏసీ సుబ్బరెడ్డి స్టేడియం, తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్టేడియం, అనంతపురంలో ఆర్‌డిటి స్టేడియం, కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియం, కర్నూలులో ప్రభుత్వ స్టేడియం మాత్రమే ఉన్నాయి.

Also Read : రోజాకు బిగుస్తున్న ఉచ్చు.. విజిలెన్స్ నివేదికలో సంచలన నిజాలు..!

ఈ స్టేడియంలు చాలా వరకు వాకర్స్ క్లబ్‌గా, రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్‌ గతంలో ప్రకటించారు. కానీ దిశగా క్రీడాభివృద్ధి శాఖ కానీ, శాప్ కానీ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించటం లేదు. 13 జిల్లాలు ఇప్పుడు 28 జిల్లాలుగా మారిపోయాయి. ఈ 28 జిల్లాలో సగానికి పైగా జిల్లాల్లో క్రీడాభివృద్ధి శాఖ సిబ్బంది కూడా లేరు. ఉన్న వారు కూడా ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఒక మూల టేబుల్‌తో సరిపెట్టుకుంటున్నారు. ఏదైనా ఈవెంట్ నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే.. స్థానిక ప్రభుత్వ కళాశాలు, జిల్లా పరిషత్ హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో ఈవెంట్ నిర్వహించి.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు.

తిరుపతిలో 75 వేల సీటింగ్ కెపాసిటీతో మెగా క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అమరావతిలో లక్ష మంది పైగా సీటింగ్ కెపాసిటీతో దేశంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మిస్తున్నట్లు ఏసీఏ అధ్యక్షులు, ఎంపీ కేశినేని చిన్నీ గొప్పగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం 75 శాతం పైగా పనులు పూర్తి చేసుకున్న మంగళగిరి స్టేడియం గురించి మాత్రం మాట్లాడటం లేదు. పాత జిల్లా కేంద్రాలకే దిక్కులేదు.. కొత్త జిల్లాలో స్టేడియం, మౌలిక వసతుల కల్పన అంటే.. ఆ ఖర్చు తడిసి మోపెడు అవుతుందనేది క్రీడా శాఖ అధికారుల మాట. క్రీడాంధ్రప్రదేశ్‌గా మారుస్తామన్న చంద్రబాబు ప్రకటనకు అనుగుణంగా ఆ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పని చేయటం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఎమ్మెల్యేలకు లోకేష్ వార్నింగ్..!

తెలుగుదేశం పార్టీలో సింగిల్ టైం ఎమ్మెల్యేలకు...

వైఎస్ఆర్ మరణానికి జగనే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం...

ఢిల్లీ వెలుపల మరో...

అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి మరో...

బ్రేకింగ్: మహానాడు పై...

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే...

మావిగన్ పై తిట్లేనా..?...

ఏపీ రాజకీయాల్లో గత పది రోజుల...

త్రిషాతో రిలేషన్.. విజయ్...

తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్,...

పోల్స్