ఎన్నికల ముందు వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు… కానీ ఇప్పుడు మాత్రం ఒకరిని చూస్తే మరొకరికి కోపం వస్తోంది. ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గర చేస్తే చాలు.. అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో తెలుసా.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కె.నాగార్జున రెడ్డి. ఇద్దరూ వైసీపీ మాజీలే. ఇద్దరికీ ఒకే ఊరు. కానీ పక్కపక్క నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఇద్దరు మార్కాపురం చెందిన నేతలే. అయితే అన్నా రాంబాబు మాత్రం గిద్దలూరు నుంచి వరుసగా మూడు సార్లు పోటీ చేశారు.. రెండుసార్లు గెలిచారు. నాగార్జున రెడ్డి మార్కాపురం నుంచి పోటీ చేసిన తొలిసారే విజయం సాధించారు. ఇదంతా 2019 నాటి మాట. ఇద్దరు నేతలు వేరు వేరు నియోజకవర్గాలు అయినప్పటికీ.. ఒకే ఊరుకు చెందిన వారు కావడంతో… ఒకరి గెలుపు కోసం మరొకరు సహకరించారు. అయితే 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది.
Also Read : ఏపీలో పవన్.. తెలంగాణలో బీజేపి.. ఇదేంటి..!
అన్నా రాంబాబును గిద్దలూరు నుంచి మార్కాపురం నియోజకవర్గానికి జగన్ మార్చారు. అలాగే కె.నాగార్జున రెడ్డిని కూడా మార్కాపురం నుంచి గిద్దలూరుకు మార్చారు. తొలుత ఇద్దరు నేతలు అయిష్టత వ్యక్తం చేసినప్పటికీ… జగన్ నచ్చచెప్పడంతో తప్పని పరిస్థితుల్లో పోటీ చేశారు. ఎన్నికలప్పుడు ఒకరికొకరం సహకరించుకుంటామని గొప్పగా ప్రకటించారు కూడా. అయితే ఈ ఎన్నికల్లో ఇద్దరు నేతలు ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఇద్దరు మాజీలయ్యారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. వాస్తవానికి మార్కాపురం నియోజకవర్గంలో అన్నా రాంబాబు ఓటమికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నాటి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఒకదశలో ఆంధ్ర నయీమ్ అంటూ స్వయంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. భూ కబ్జాలు పెద్ద ఎత్తున చేశారని… అలాగే పంచాయితీల్లో కోట్లు గడించారనేది ప్రధాన ఆరోపణ. చివరికి సొంత పార్టీకి చెందిన నేతల స్థలాలను కూడా కృష్ణమోహన్ కబ్జా చేశారనేది బహిరంగ రహస్యం. దీంతో వైసీపీ సర్కార్‌పై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే వైసీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఓట్లు వేశారు.
Also Read : ఓట్ల కోసం ఆల్ ఫ్రీ.. భారం ఎవరిపైనా..?
ఇక గిద్దలూరు నియోజకవర్గంలో కూడా వైసీపీ హయాంలో అభివృద్ధి జరగలేదు. పైగా కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో వారిపైనే అన్నా రాంబాబు పెత్తనం చేయడంతో పాటు.. దుర్భాషలాడటం, దాడులకు యత్నించారనేది ప్రధాన ఆరోపణ. జనసేన కార్యకర్తను బహిరంగంగా తిట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు కూడా. దీనిపై స్వయంగా రాంబాబు కూడా వివరణ ఇచ్చుకున్నాడు. ఇక సరిగ్గా ఏడాది ముందు తనకు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం నేతలు సహకరించడం లేదని.. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేది లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే చివరి నిమిషంలో రాంబాబును మార్చేసి నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు పంపడంతో… ఆయన వర్గం నేతలు ఎవరూ కనీసం సహకరించలేదనేది కుందూరు వర్గం ఆరోపణ. దీనిపై అప్పట్లోనే వైసీపీ పెద్దలకు నాగార్జున రెడ్డి స్వయంగా ఫిర్యాదు చేశారు.
Also Read : టీటీడీ సంచలన నిర్ణయం..? వారికి గుడ్ బై..?
మార్కాపురం నియోజకవర్గం నాదంటే నాదని ప్రస్తుతం ఇద్దరు నేతలు సిగపట్లు పడుతున్నారు. నేను మాజీని అని కుందూరు నాగార్జున రెడ్డి… నేను ప్రస్తుత ఇంఛార్జ్‌ను అని అన్నా రాంబాబు నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు. అసలు మాజీకి ఇక్కడేం పని అనేది అన్నా వర్గం మాట. మీ వల్ల మార్కాపురంలో ఓడిపోయామని కుందూరు వర్గంపై అన్నా వర్గం బహిరంగంగానే విమర్శలు చేస్తోంది. దీంతో జగన్ సమక్షంలోనే మీ సంగతి తేల్చుకుంటా అంటూ ఇద్దరు నేతలు సవాల్ విసురుకున్నారు కూడా. నేతల సిగపట్లతో తాము ఎవరి వైపు ఉండాలో అర్థం కావటం లేదంటున్నారు నియోజకవర్గం వైసీపీ నేతలు.

