అసలు వాళ్లిద్దరూ ఏమయ్యారు…. ఇప్పుడు ఇదే ప్రశ్న ఏపీలో హాట్ టాపిక్. ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే… మాజీ హోం మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తిచేసుకుంది కూడా. ఈ వంద రోజుల్లో ఎన్నో జరిగాయి. వీటిపైన వైసీపీ నేతలు స్పందించారు కూడా. అయితే మాజీ హోం మంత్రులు మాత్రం అసలు ఏమయ్యారో కూడా తెలియటం లేదు.
2019లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మంత్రివర్గంలోనే మేకతోటి సుచరిత ఛాన్స్ కొట్టేశారు. జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన సుచరిత.. ప్రభుత్వం పైన ఎన్ని విమర్శలు వచ్చినా కూడా లైట్ తీసుకున్నారు. చివరికి రాజధానిలో రైతులు ధర్నా చేస్తున్నప్పటికీ ఏమాత్రం సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. ఇక దిశ పేరుతో ఓ చట్టం కూడా తీసుకోచ్చి.. ప్రత్యేక పోలీసు స్టేషన్ లను కూడా ఏర్పాటు చేశారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సుచరితను తప్పించిన జగన్.. ఆమె స్థానంలో తానేటి వనితకు బాధ్యతలు అప్పగించారు.
పదవి పోయిన తర్వాత కొద్దిరోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు సుచరిత. అదే సమయంలో వనిత కూడా శాంతిభద్రతల విషయంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే ఏ మాత్రం పట్టించుకోలేదు.
Read Also : రహస్యంగా జగన్ ఢిల్లీ టూర్…? తిరుమల పర్యటన రద్దు వెనుక కారణం…?
ఈ ఇద్దరు మహిళా నేతలు 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ జగన్ ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. అప్పుడు కూడా ఈ మాజీలు దూరంగానే ఉన్నారు. విజయవాడ వరదలు, తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో వైసీపీ అధినేత జగన్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఈ ఇద్దరు మాజీలు మాత్రం మాకెందుకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అసలు వాళ్లిద్దరూ ఏమయ్యారు అని సొంత పార్టీ నేతలే ప్రశ్నించుకుంటున్నారు.