ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. కడప, తిరుపతి కార్పొరేషన్లతో పాటు రాజంపేట, మైదుకూరు మున్సిపాలిటీల్లోని మొత్తం 72 వార్డుల్లో మళ్లీ నామినేషన్ల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నామినేషన్ల పర్వంలో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని, బలవంతంగా అడ్డుకున్నారంటూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పందించడంతో ఈ కీలక మార్పు చోటుచేసుకుంది.
Also Read : ప్రొటోకాల్స్ పక్కనపెట్టి సీఎం ఇంటికి జనసేనాని..!
కోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు, రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసుకోవచ్చని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, గతంలో ఓటమి, ఖర్చుల భయంతో వెనకడుగు వేసిన ప్రతిపక్ష వైసీపీ నేతలు ఇప్పుడైనా నామినేషన్లు వేయడానికి ముందుకు వస్తారా లేదా అన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కడప కార్పొరేషన్లో 11 డివిజన్లు, తిరుపతిలో 18 డివిజన్లు, రాజంపేటలో 11 వార్డులతో పాటు అత్యధికంగా మైదుకూరు మున్సిపాలిటీలో ఏకంగా 32 వార్డులకు రీ-నామినేషన్ల ప్రక్రియ జరగనుంది.
Also Read : దుబాయ్ కంటే మన దేశంలోనే పెట్రోల్, డీజిల్ చీప్..!
గతంలో తలెత్తిన ఘర్షణ వాతావరణం వల్ల నామినేషన్ పత్రాలు సైతం చిరిగిపోయిన సంఘటనలపై వైసీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటానికి దిగింది. ప్రస్తుతం కోర్టు రక్షణ, ఎస్ఈసీ ప్రత్యేక భద్రతా నిబంధనలు జారీ చేయడంతో, ఈ 48 గంటల గడువును వైసీపీ లీడర్లు ఎలా ఉపయోగించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న నామినేషన్ల పరిశీలన పూర్తి చేసి, అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. సుప్రీం కోర్టు జోక్యంతో లభించిన ఈ గోల్డెన్ ఛాన్స్‌ను వాడుకుని వైసీపీ అభ్యర్థులు బరిలోకి దిగితే సరే సరి… లేదంటే క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ మరింత డీలా పడే ప్రమాదం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


