ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లా హాట్ టాపిక్‌గా మారింది. తొలి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ మంత్రి పదవులు, ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన గుండ కుటుంబం.. ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యింది. నిన్నటి వరకు ధర్మాన ప్రసాదరావుపై దుమ్మెత్తి పోసిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి.. ఇక నుంచి ఆయనతోనే కలిసి పని చేయాల్సిన పరిస్థితి. దీంతో సిక్కోలు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో.. ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మాన, గుండ కుటుంబాలు కలిస్తే ‘వెంటబెట్టేస్తాం’.. మీకేమైనా డౌటా అని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. అయితే ఈ మాటలన్న 48 గంటల్లోపే వైసీపీకి ఊహించని షాక్ తగిలింది.
Also Read : మార్కెట్లో కనపడని ₹500 నోట్లు.. అసలేం జరుగుతోంది..?
శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి గ్రామం నుంచి వైసీపీని వెంటబెట్టేశారు. సిక్కోలు భాషలో వెంటబెట్టాస్తాం.. అంటే ఖాళీ చేయటం అని అర్థం. ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించిన దగ్గర్నుంచి ఆయనతోనే ఉన్న ఇప్పిలి గ్రామంలో మెజారిటీ కాపు కుటుంబాలు ఇప్పుడు వైసీపీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 700 కుటుంబాలు.. అంటే దాదాపు 1500 మంది ఓటర్లు టీడీపీలో చేరినట్లు ఎమ్మెల్యే గోండు శంకర్ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల సీజన్ కాబట్టి అంకెలో తేడా ఉండొచ్చేమో గానీ, వైసీపీకి మాత్రం ఇది భారీ షాక్.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నట్లు పైకి చెబుతున్నారు. కానీ వాస్తవం అది కాదు. రాజకీయ లబ్ధి కోసం మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న ధర్మాన, గుండ కుటుంబాలు ఇప్పుడు కలిసిపోవడంతో తామెందుకు వైరిపక్షంగా ఉండాలని కాపు కుటుంబాలు భావించాయి. మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ నేతృత్వంలో కాపు కుటుంబాలన్నీ ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నాయి. నిజానికి 2004 ఎన్నికలకు ముందు నుంచి ఈ గ్రామం ధర్మాన ప్రసాదరావుకు అండగా నిలిచింది. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గ్రామంలోకి రాకుండా.. చివరికి పోలింగ్ స్టేషన్ వైపు కూడా రాకుండా ఊరి బయటే అడ్డుకున్నారు. ఇది అప్పట్లో పెద్ద దుమారం రేపింది కూడా.
Also Read :పులివెందులపై వైసీపీ పట్టు చేజారిపోతుందా..?
కానీ ఇప్పుడు మొత్తం కాపు కుటుంబాలన్నీ కట్టకట్టుకొని టీడీపీలో చేరిపోయాయి. గుండ లక్ష్మీదేవి రావడం వల్ల వైసీపీ బలపడుతుందని ధర్మాన భావించారు. కానీ ఇప్పిలిలో కాపుల మనోభావాలు దెబ్బతింటాయని అంచనా వేయలేకపోయారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతు తెలిపినా కూడా ఇప్పిలి కాపులు ధర్మాన వెంటే ఉన్నారు. 2024లో శ్రీకాకుళం నగరంతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ధర్మానకు ఓట్లు తక్కువ పోలైనా ఇప్పిలి పోలింగ్‌బూత్‌లో మాత్రం ధర్మానకే ఎక్కువ ఓట్లు పడ్డాయంటే అందుకు కారణం ఇక్కడ కాపు నేతలే. ఇప్పుడు మేయర్ ఎన్నిక కోసం గుండ లక్ష్మీదేవిని వైసీపీలోకి తీసుకోవడంతో.. ధర్మానకు ఇప్పిలి గ్రామస్థులు రామ్ రామ్ చెప్పేశారు. ఇది ధర్మానకే కాదు.. వైసీపీకి కూడా ఊహించని షాక్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


