ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా తిరుగులేని కంచుకోటగా ఉన్న వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి, నిన్నటివరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకు పులివెందుల అంటే వైసీపీకి వంద శాతం ఏకపక్ష విజయం లభించే ప్రాంతం. కానీ, తాజా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలిస్తే.. పులివెందుల పురపాలక సంఘంపై జగన్ తన పట్టును కోల్పోతున్నారా..? అనే సరికొత్త రాజకీయ చర్చకు తెరలేచింది.
Also Read : రాష్ట్రమంతా ప్రశాంతం.. అక్కడ తప్ప..!
గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 40 వార్డుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూటమి ఊహించని రీతిలో దూకుడు ప్రదర్శిస్తూ, పలు వార్డులను ముందే ఏకగ్రీవం చేసుకునే స్థాయికి చేరడం వైఎస్సార్‌సీపీ శ్రేణులను తీవ్ర ఆందోళనలో పడేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సొంత పిన్ని, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ వైఎస్ ప్రమీలమ్మను చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దింపారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ కనిపించడం లేదనే విశ్లేషణలు వినపడుతున్నాయి.
మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులు ఉంటే.. వైఎస్సార్‌సీపీ నుంచి కేవలం 30 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడం, మిగిలిన 10 వార్డులను కూటమి అభ్యర్థులకు ఏకగ్రీవంగా వదిలేయాల్సి రావడం జగన్ నాయకత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గతంలో పులివెందుల రూరల్ జెడ్‌పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఓటమి చవిచూడటం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ నామినేషన్ల ప్రక్రియలోనే వెనకడుగు వేయడం చూస్తుంటే ఓటర్లలో మార్పు మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : సల్మాన్ ఖాన్ కనెక్షన్ టైగర్ ష్రాఫ్ కొంప ముంచిందా..?
మరోవైపు, పులివెందులలో నామినేషన్ల దాఖలు చివరి రోజున టీడీపీ, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలు, పరస్పర దాడులు అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు గాల్లోకి ఆరు రౌండ్ల కాల్పులు జరపాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గ నేతలను, కార్యకర్తలను కాపాడుకోవడంలో విఫలమవుతున్నారనే అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది.


