ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం ఊహించని స్థాయిలో వివాదాలకు దారితీస్తోంది. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు వేయడానికి వెళ్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులను భూమన అభినయ్‌రెడ్డి తన అనుచరులతో కలిసి అడ్డుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Also Read : బ్రేకింగ్: సాయికృష్ణ కేసు సీబీఐకి..!
ఈ ఘర్షణలో భూమన అభినయ్‌రెడ్డి అత్యంత అరాచకంగా వ్యవహరించారంటూ కూటమి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నామినేషన్ కేంద్రానికి వెళ్తున్న కూటమి అభ్యర్థుల చేతుల్లోని అధికారిక నామినేషన్ పత్రాలను లాక్కొని, వాటిని ముక్కలు ముక్కలుగా చించేశారనే ఆరోపణలు తిరుపతి రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి, వారు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవాలనే పక్కా వ్యూహంతోనే వైసీపీ శ్రేణులు ఈ దౌర్జన్యానికి తెగబడ్డాయని స్థానిక తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : పాపం.. వాళ్లంతా బకరాలేనా..!
పత్రాలు చించేసిన వ్యవహారంతో ఆగ్రహానికి గురైన కూటమి అభ్యర్థులు, నేతలు భూమన అభినయ్‌రెడ్డిని అక్కడే నిలదీశారు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో పరస్పర వాగ్వాదం, తోపులాట జరగడంతో బైరాగిపట్టెడ పరిసర ప్రాంతాలు యుద్ధవాతావరణాన్ని తలపించాయి. పరిస్థితులు చేతులు దాటిపోయేలా కనిపించడంతో సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని తీవ్ర ఉత్కంఠ భరిత పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి.


