విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. విజయవాడ వైసీపి మేయర్ అభ్యర్థిగా ఎంపిక అయిన, ప్రస్తుత మేయర్ రాయన భాగ్యలక్ష్మి పార్టీ నేతలకు గట్టి ఝలక్ ఇచ్చారు. ఎన్నికల ఖర్చు భరించే విషయంలో ఆమె చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. “నా దగ్గర డబ్బులు లేవు.. మీరే ఖర్చు పెట్టుకోవాలి” అంటూ ఆమె నగర నేతలకు స్పష్టం చేయడంతో వైసీపి శ్రేణులు తీవ్ర గందరగోళంలో పడ్డాయి. నిన్నటి వరకు ఆర్థికంగా తానే అండగా ఉంటానని చెప్పిన భాగ్యలక్ష్మి, హఠాత్తుగా చివరి నిమిషంలో మాట మార్చడంతో ఏం చేయాలో పాలుపోక నగర వైసీపి నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
Also Read : జనసేన పోటీ సీట్లపై పవన్ లెక్క తేలిందా..?
వాస్తవానికి విజయవాడ నగర మేయర్ అభ్యర్థిగా బీసీ మహిళ కోటాలో రాయన భాగ్యలక్ష్మి పేరును అధిష్టానం ఖరారు చేసింది. 2021లో పరోక్ష విధానంలో జరిగిన ఎన్నికల్లో ఆమె మేయర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈసారి ఎన్నికల ఖర్చు భారీగా ఉండనుండటంతో ఆమె వెనకడుగు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. నగర శివార్లలో ఉన్న తన భూమిని ఎవరైనా కొనుగోలు చేసి డబ్బులు సర్దుబాటు చేస్తేనే తాను పోటీ చేస్తానని, లేదంటే కష్టమని ఆమె నేతలకు తెగేసి చెప్పినట్లు సమాచారం.
Also Read : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వివాదం.. రంగంలోకి ఈడీ..!
కానీ, సదరు భూమి నిషేధిత జాబితాలో ఉండటంతో దానిని విక్రయించి డబ్బులు సర్దుబాటు చేయడం ప్రస్తుతానికి సాధ్యం కాదని నేతలు భావిస్తున్నారు. మరోవైపు విజయవాడ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు కూటమి తరపున వంగవీటి రాధాకృష్ణ బరిలో ఉంటారనే ప్రచారం బలంగా సాగుతుండటంతో వైసీపి నేతల్లో గుబులు మొదలైంది. రాధాకృష్ణను ఢీకొట్టేందుకు దేవినేని అవినాష్ సతీమణి సుధీరను రంగంలోకి దించాలని అధిష్టానం భావించినప్పటికీ, అవినాష్ దానికి సుముఖంగా లేరని టాక్. ఇటు కేశినేని నాని కుమార్తె శ్వేత కూడా పోటీకి ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బలమైన అభ్యర్థి అనుకున్న రాయన భాగ్యలక్ష్మి కూడా ఆర్థిక కారణాల వల్ల వెనకడుగు వేయడం వైసీపిని తీవ్ర రక్షణలో పడేసింది. ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


