బీజేపీ నేతల ఒత్తిళ్లతోనే విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ సీటు జనరల్ మహిళ రిజర్వేషన్ అయ్యిందా..? అంటే.. అవుననే మాటే బాగా వినిపిస్తోంది. విశాఖపట్నం మేయర్ సీటును జనరల్ మహిళకి రిజర్వేషన్ చేయటం ఇద్దరు బీజేపీ ప్రముఖుల ప్రమేయంతోనే జరిగిందంటున్నారు. ఒకరు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అయితే.. మరొకరు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనే మాట బాగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే రాజు గారికేమో తన కూతురును మేయర్‌గా చూడాలని కోరిక ఉందటా! తన భార్యను విశాఖపట్నం బీజేపీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేయించాలన్న కోరిక అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు ఉందనేది సన్నిహితుల మాట. అందుకే పథకం ప్రకారమే సీఎం చంద్రబాబుపైన బీజేపీ కేంద్ర అధికార పెద్దల ద్వారా వారిద్దరే ఒత్తిడి చేయించారన్న అనుమానం టీడీపీ, జనసేన నాయకుల్లో బలంగా ఉంది.
Also Read : గుర్రపు స్వారీ ఆటిజం పిల్లల్లో ఇంత మార్పు తెస్తుందా..?
నిన్నటి వరకు మంత్రి పదవి కోసం బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తీవ్రంగా ప్రయత్నించారు. బీజేపీలో సీనియర్ ఎమ్మెల్యే హోదాలో మంత్రి పదవి ఆశించారు. అయితే సామాజిక సమీకరణలు, లెక్కల్లో భాగంగా బీజేపీ కోటా సత్యకుమార్ యాదవ్‌కు ఓకే చేసింది. అప్పటి నుంచి కాస్త అసహనంతో ఉన్న విష్ణుకుమార్ రాజు.. సమయం వచ్చినప్పుడల్లా.. కూటమి పెద్దలపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అయితే విశాఖ మేయర్ కుర్చీ పై తన కుమార్తెను చూడాలన్నకోరిక మొదలైన నాటి నుంచి కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్, పవన్ కళ్యాణ్‌లకు అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు. లోకేష్ విశాఖ పర్యటనకు వచ్చిన ప్రతిసారి.. ముందుగా ఆయనే వెళ్లి రిసీవ్ చేసుకోవడం.. మర్యాదలు చేయడం.. ఇంటికి రావాలని ఆహ్వానించడం వంటి పనులు చేశారు. విష్ణుకుమార్ రాజు తీరు చూసి అప్పట్లోనే టీడీపీ నేతలు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు.
మంత్రి పదవి రాదనుకున్న తర్వాతే తన కుమార్తెను మేయర్ చేయడమే లక్ష్యం అన్నట్లుగా విష్ణుకుమార్ రాజు పావులు కదుపుతున్నారు. ఇక కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్‌కు ఉమ్మడి విశాఖ జిల్లాతో ఏ మాత్రం సంబంధం లేదు. కానీ చంద్రబాబు నాయుడు సూచన మేరకు బీజేపీ నేతలు అనకాపల్లి ఎంపీ టికెట్ కేటాయించారు. అనకాపల్లి వచ్చిన నెల రోజుల్లోనే ఎంపీగా గెలిచారు సీఎం రమేశ్. ఇప్పటికీ ఆయన కేరాఫ్ హైదరాబాద్, ఢిల్లీ, విశాఖ అన్నట్లుగానే ఉన్నారు. తాజాగా సీఎం రమేశ్ కూడా తన భార్యను విశాఖపట్నం మేయర్ చేయాలని అనుకుంటున్నట్లు సన్నిహితుల మాట. ఏది ఏమైనా తెలుగుదేశం, జనసేన పార్టీలకు మంచిపట్టున్న విశాఖపట్నంలో మేయర్ సీటు బీజేపీకి ఇవ్వటాన్ని ఆయా పార్టీల నాయకులు అంగీకరించే పరిస్థితి లేదు.
Also Read : ఏపీలో మున్సిపల్ సమరానికి సై.. రేపే షెడ్యూల్ విడుదల..?
తమ పార్టీ అభ్యర్థి పోటీలో లేకున్నా పరవాలేదు.. జనసేన అభ్యర్థి అయినా మాకు ఒకే.. కానీ బీజేపీకి మేయర్ సీటివ్వటం ముమ్మాటికి ఒప్పుకునేది లేదని కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. విశాఖపట్నంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు బలంగా ఉన్నాయి. బీజేపీకి అంతంత మాత్రమే ప్రజా మద్దతు ఉంది. అలాంటప్పుడు బీజేపీకి మేయర్ సీటు ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదనేది టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల మాట. ఇక్కడ మరో విశేషమేమిటంటే… బీజేపీ ఎమ్మెల్యే గోదావరి జిల్లా వాసి.. సీఎం రమేష్ రాయలసీమ కడప జిల్లా వాసి.. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ.. అయినా సరే.. ఇద్దరు తమ కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీసీలు ఎక్కువగా ఉండే విశాఖపట్నంలో జనరల్ మహిళకు రిజర్వేషన్ చేయటం ఏమిటనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ విషయంలో సీఎం చంద్రబాబు పైన ఈ ఇద్దరు నేతలు ఒత్తిడి చేశారనే మాట బాగా వినిపిస్తోంది. ఇంతకు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.


