రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ చేసినన్ని ప్రయోగాలు మరే పార్టీ చేయలేదు. టీడీపీ పుణ్యమా అని ఎంతో మంది రాజకీయంగా అందలాలు అందుకున్నారు. మంచి భవిష్యత్తుని చూశారు. అనూహ్యంగా ఉన్నత స్థానాలకు ఎగబాకారు. రాజకీయంగా అవకాశాలు రావడం కష్టం అనుకుంటున్న వారికి టీడీపీ పిలిచి టికెట్లు ఇచ్చి కీలక పదవులు కట్టబెట్టింది. అలా టీడీపీ స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ ఎంతో మందికి చాన్స్ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే.. సామాన్య కార్యకర్తలకు టికెట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీ సొంతం. అయ్యన్నపాత్రుడు, తమ్మినేని, ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాష, బాలయోగి, కాల్వ శ్రీనివాసులు వంటి ఎంతో మందిని రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలుగా మార్చిన చరిత్ర టీడీపీదే.
Also Read : బ్రేకింగ్: రెండు రోజుల్లో పవన్ – విజయ్ భేటీ..!
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ ఏ విధానం అవలంభిస్తుందనే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. టీడీపీ అయితే విజయావకాశాలనే ప్రమాణంగా తీసుకుని ఏ ప్రయోగం అయినా చేస్తుంది. అందుకే మరోసారి తటస్థులకు టికెట్లు ఇచ్చేందుకు చూస్తుందా అన్న చర్చ సాగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తరువాత మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్నపుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించినట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో తటస్థులకు టికెట్లు ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఈ చర్చలో కొందరు మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది.
మరి కొందరు అయితే పార్టీలో సీనియర్ నేతలు, ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలు దక్కని వారికి ఒక చాన్స్ ఇవ్వాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. అయితే వీటి మీద అధినేత చంద్రబాబు ఏమి ఆలోచిస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది అయితే చర్చగా ఉంది. తటస్థులకు 1999లో టీడీపీ పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చింది. ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఇచ్చింది. దాంతో ఎంతో మంది విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, అలాగే సామాజిక సేవలో ఉన్న వారు కీలక పదవులు అందుకున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ అయితే ఇలాంటి ప్రయోగాలు అనేక సార్లు చేసి సక్సెస్ అయ్యారు. ఆయన ఎప్పుడూ టాలెంట్ చూసి అవకాశం ఇచ్చేవారు. అలా రాజకీయాలకు దూరంగా ఉండే డీవీ సుబ్బారావు అనే ప్రముఖ న్యాయవాదికి అప్పట్లో టికెట్ ఇచ్చి విశాఖ మేయర్‌ని చేసిన ఘనత ఎన్టీఆర్ దే.
Also Read : జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ సంచలన పిటిషన్..!
ఇప్పుడు కూడా విశాఖ, విజయవాడ, రాజమండ్రి, అనంతపురం, కర్నూలు వంటి ప్రధాన నగరాల మేయర్ లాంటి పదవులకు రాజకీయ నీడ కంటే కూడా ప్రజల్లో మంచి పేరున్న వారిని తెచ్చి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది. మేయర్లు, జిల్లా పరిషత్తు చైర్మన్లు వంటి పదవులలో కొన్ని తటస్థులకు ఇస్తే కనుక ఫ్రెష్ లుక్‌తో పాటు మంచి ఫలితాలు కూడా వస్తాయని పార్టీలో చర్చిస్తున్నారు. టీడీపీకి విద్యావంతులు, తటస్థ ఓటర్లలో మంచి పేరు ఉంది. గ్రాఫ్ కూడా అక్కడ బాగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో మరింతగా పాపులారిటీని పెంచుకోవాలని పార్టీ యోచిస్తోంది. దాంతో తటస్థులకు పార్టీ టికెట్ ఇవ్వవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. దాంతో చాలా చోట్ల విద్యావంతులు, ప్రముఖులు, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారు టీడీపీ పెద్దలను ఆశ్రయిస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి టీడీపీ నుంచి ఎవరికి ఈ లక్కీ చాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.


