రష్యాతో సాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ఉక్రెయిన్ ప్రభుత్వం ఒక అనూహ్యమైన మార్గాన్ని ఎంచుకుంది. దేశంలోని అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ (పోర్నోగ్రఫీ) పరిశ్రమను చట్టబద్ధం చేయడం ద్వారా భారీగా పన్నులు వసూలు చేయవచ్చని ఉక్రెయిన్ పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ యారోస్లావ్ జెలెజ్నియాక్ ఒక నూతన బిల్లును ప్రతిపాదించారు. ఈ చట్టబద్ధత ద్వారా ప్రభుత్వానికి దాదాపు 25 మిలియన్ డాలర్ల వరకు అంటే సుమారు రూ. 210 కోట్లు అదనపు పన్ను ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read : జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతున్న తెలంగాణా బస్ కండక్టర్..!
ఈ భారీ మొత్తాన్ని రష్యా సైన్యాన్ని తిప్పికొట్టడానికి అత్యంత కీలకమైన సుమారు 30,000 మిలిటరీ డ్రోన్ల కొనుగోలు లేదా తయారీకి ఉపయోగించాలని ఉక్రెయిన్ యోచిస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం ఉక్రెయిన్‌లో అడల్ట్ కంటెంట్‌ను తయారు చేయడం లేదా పంపిణీ చేయడం పూర్తిగా నిషేధం మరియు దీనికి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఓన్లీఫ్యాన్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వేలాది మంది ఉక్రేనియన్లు మిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదిస్తున్నారు.
ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ క్రియేటర్ల నుండి పన్నులు వసూలు చేస్తోంది, కానీ వారు పన్నులు చెల్లిస్తే తాము చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆధారాలు దొరికిపోతున్నాయి. పన్ను కట్టకపోతే ట్యాక్స్ ఎగవేత కేసు, పన్ను కడితే అడల్ట్ కంటెంట్ కేసు ఎదుర్కోవాల్సి రావడం అక్కడ పెద్ద గందరగోళానికి దారితీసింది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు పోలీసులు క్రియేటర్ల ఇళ్లపై దాడులు చేస్తూ వేల డాలర్ల లంచాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read : ఏపిలో కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!
ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ ఉక్రేనియన్ ఓన్లీఫ్యాన్స్ క్రియేటర్ పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ పిటిషన్ దాఖలు చేసింది. తాను దాదాపు 9 లక్షల డాలర్లు పన్నుగా చెల్లించానని, యుద్ధ సమయంలో దేశానికి ఆర్థికంగా సహాయపడుతున్న తమను నేరస్థులుగా చూడవద్దని ఆమె పేర్కొంది. ఈ పిటిషన్‌కు కేవలం వారం రోజుల్లోనే 25,000 మందికి పైగా పౌరులు మద్దతు తెలపడంతో అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా సానుకూలంగా స్పందించారు. పోర్నోగ్రఫీని లీగలైజ్ చేసే ఈ ప్రతిపాదనను పరిశీలించాలని ఆయన పార్లమెంట్‌ను కోరారు.

